టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగ కోతలను ప్రకటించింది. గత ఏడాది జనవరిలో ఏకంగా 10,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన మైక్రోసాఫ్ట్ అప్పటి నుంచి పలు చిన్న రౌండ్ల లేఆఫ్‌లు ప్రకటిస్తూ వచ్చింది. ఈ ఏడాది మేలో చివరిసారిగా తొలగింపులు చేపట్టిన టెక్ దిగ్గజం తాజగా మరో రౌండ్ తొలగింపును ప్రకటించింది.
ఈ తొలగింపుల్లో మైక్రోసాఫ్ట్ మిక్స్‌డ్ రియాలిటీ విభాగం, అజ్యూర్ క్లౌడ్ యూనిట్‌తో సహా వివిధ విభాగాలలో సుమారు 1,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. అత్యంత ప్రభావితవుతున్న విభాగాల్లో హోలోలెన్స్ 2 ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్‌ను అభివృద్ధి చేసిన మిక్స్‌డ్ రియాలిటీ విభాగం ఉంది. ఓ వైపు ఉద్యోగ కోతలు ఉన్నప్పటికీ, హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది.
'మైక్రోసాఫ్ట్ మిక్స్ డ్ రియాలిటీ సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఈ రోజు ప్రకటించాం. రక్షణ శాఖకు సంబంధించిన ఐవీఏఎస్ కార్యక్రమానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మన సైనికులకు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాం. అదనంగా, విస్తృత మిక్స్ డ్ రియాలిటీ హార్డ్ వేర్ ఎకోసిస్టమ్ ను చేరుకోవడానికి మేము W365 లో పెట్టుబడిని కొనసాగిస్తాం. ఇప్పటికే ఉన్న హోలోలెన్స్ 2 కస్టమర్లు, భాగస్వాములకు మద్దతు ఇస్తూనే హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగిస్తాం' అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి క్రెయిగ్ సిన్కోటా 'ది వెర్జ్'కు ఈమెయిల్ ప్రకటనలో తెలిపారు.
మిక్స్ డ్ రియాలిటీ విభాగంతో పాటు అజూర్ క్లౌడ్ యూనిట్ ను కూడా గణనీయమైన తొలగింపులు తాకుతున్నాయి. అజూర్ ఫర్ ఆపరేటర్స్, మిషన్ ఇంజనీరింగ్ టీమ్‌లలో వందలాది ఉద్యోగాలను తొలగించినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై దృష్టి సారించడానికి 2021లో స్థాపించిన స్ట్రాటజిక్ మిషన్స్ అండ్ టెక్నాలజీస్ ఆర్గనైజేషన్‌లో ఈ టీమ్‌లు భాగంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment