సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పబోతోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు అంటే రూ. 12,000 లకు పెంచాలని యోచిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడైంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ ప్రణాళికను ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని, దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్ ప్రతిపాదనలో చర్చించినట్లు సమాచారం.
‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా పురుష, మహిళా రైతులిద్దరికీ రూ.6,000లను అందిస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం గత నవంబర్ వరకు 15 విడతల్లో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది.
అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ స్థాయిలో నగదు సాయాన్ని రెట్టింపు చేసే ప్రణాళిక ఇంతకు ముందు ఎప్పుడూ చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత కల్పించే ఈ చర్యగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ప్రణాళికపై అటు వ్యవసాయ శాఖ గానీ, ఇటు ఆర్థిక శాఖ గానీ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment