న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) కింద క్రమం తప్పకుండా ఉపసంహరణ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తీసుకురానున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. దీంతో 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ ఖాతాదారులు అప్పటి వరకు సమకూరిన నిధి నుంచి కావాల్సినంతే ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఈ ప్రతిపాదన పురోగతి దశలో ఉంది. దాదాపు వచ్చే త్రైమాసికం చివరి నాటికి ఈ పథకంతో ముందుకు వస్తాం’’అని మహంతి చెప్పారు.
ప్రస్తుతం ఎన్‌పీఎస్ పథకంలో 60 ఏళ్లు నిండిన వారు అప్పటి వరకు సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకుని, మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది. అంతేకానీ, నెలవారీ ఇంత చొప్పున తీసుకునే అవకాశం లేదు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ను అమల్లోకి తీసుకొస్తే అప్పుడు పింఛనుదారులు నెలవారీ లేదా మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికొకసారి.. వీటిల్లో తమకు అనువైన ఆప్షన్ ఎంపిక చేసుకుని, క్రమం తప్పకుండా ఆదాయం పొందొచ్చు. ఇలా 75 ఏళ్లు వచ్చే వరకు తీసుకోవడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ అవకాశం కల్పించనుంది.
‘‘నా నిధిపై మంచి రాబడులు వస్తున్నప్పుడు ఆ మొత్తాన్ని ఎందుకు కొనసాగించకూడదు. ఎందుకు యాన్యుటీ తీసుకోవాలనే అభ్యర్థనలు వస్తున్నాయి’’అని మహంతి తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, యాన్యుటీని వాయిదా వేసుకోవచ్చని, దీనివల్ల తర్వాత అధిక మొత్తంలో పింఛను వస్తుందని చెప్పారు. తాము తీసుకురాబోయే మార్పుతో, చందాదారులు 40 శాతం నిధితో డిఫర్డ్ యాన్యుటీని ఎంపిక చేసుకుని, మిగిలిన 60 శాతం ఫండ్‌ను క్రమం తప్పకుండా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment