ముంబై: మల్టీప్లెక్స్‌లకు (సినిమా ప్రదర్శన, వినోద కేంద్రాలు) మరో ఏడాది పాటు నష్టాలు తప్పవని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా మరోవిడత తీవ్రరూపం దాల్చడంతోపాటు దేశవ్యాప్తంగా స్థానిక లాక్‌డౌన్‌లు మల్టీప్లెక్స్‌లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. దీనివల్ల వచ్చే కొన్ని నెలల పాటు వీక్షకుల సీట్ల భర్తీ (ఆక్యుపెన్సీ) తక్కువగానే ఉంటుందని వివరించింది. దీంతో వరుసగా రెండో ఆర్థిక ఏడాది మల్టీప్లెక్స్ సంస్థలు (పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తదితర) నిర్వహణ నష్టాలను ఎదుర్కొంటాయని అభిప్రాయపడింది.
కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న రంగం ఇదొకటని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లోనే రికవరీని (కోలుకోవడం) చూస్తుందని తన నివేదికలో క్రిసిల్ పేర్కొంది. 2020 మార్చిలో లాక్‌డౌన్‌ల కంటే ముందే మూతపడినవి మల్టీప్లెక్స్‌లేనని.. ఆలస్యంగా (అక్టోబర్‌లో) తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన రంగం కూడా ఇదేనని క్రిసిల్ వివరించింది. కార్యకలాపాలు తిరిగి ఆరంభించిన తర్వాత నుంచి సీట్ల భర్తీ మెరుగుపడడం కనిపించినట్టు.. నిర్వహణ లాభం దృష్ట్యా తటస్థ స్థాయికి ప్రస్తుత త్రైమాసికంలో చేరుకోవచ్చని అంచనా వేసినట్టుగా పేర్కొంది.
అయితే, ఇటీవల పెరిగిపోయిన కేసుల వల్ల రికవరీ అన్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగానికి వాయిదా పడొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2020–21లో మొదటి ఆరు నెలల్లో సీట్ల భర్తీ 10–12 శాతంగాను, ద్వీతీయ ఆరు నెలల్లో 20–22 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ తరహా చర్యలతో భారీ కలెక్షన్లు వచ్చే నూతన సినిమాల విడుదల ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికానికి (జూలై–సెప్టెంబర్) వాయిదా పడొచ్చని తెలిపింది. 2020–21లో మల్టీప్లెక్స్‌లు రూ.900 కోట్ల నష్టం చూడగా.. 2021–22లోనూ నష్టాలనే నమోదు చేస్తాయని అంచనా వేసింది.
6 నెలలు నెట్టుకురావచ్చు..
2020–21లో వ్యయాల నియంత్రణ కోసం మల్టీప్లెక్స్ కంపెనీలు తీసుకున్న చర్యలు, మూలధన వ్యయాల వాయిదా, ఈక్విటీల జారీ రూపంలో సమీకరించిన రూ.1,350 కోట్ల నిధులతో అవి నష్టాలను ఏదుర్కోగలవని క్రిసిల్ తెలిపింది. వాటివద్ద ప్రస్తుద నగదు నిల్వలు 4–6 నెలల పాటు నిర్వహణ వ్యయాలు, రుణాల చెల్లింపులకు సరిపోతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment