అత్యంత రద్దీ నగరమైన ముంబై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదైన ఇక్కడి హౌసింగ్ మార్కెట్ నివాసితులకు ఒక ప్రధాన సవాలుగా కొనసాగుతోంది. పెరుగుతున్న ధరలతో అందుబాటు అద్దెలో ఇళ్లు దొరకడం కష్టంగా మారింది. ఇటీవల విటా అనే ఒక లాయర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్ట్ విపరీతమైన ఖర్చులను ఎత్తిచూపడంతో పాటు ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది.
ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లో 1 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల అద్దె నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 వరకు ఉంటోందని విటా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విడిగా ఉండేందుకు బయటకు వెళ్లకుండా తమ జీవన ఏర్పాట్లను పునఃపరిశీలించుకోవాలని, కుటుంబ సభ్యులతో కలిసి నివసించాలని తోటి యూజర్లకు ఆమె సూచించారు. "ముంబైలో 1 బీహెచ్‌కే అద్దె రూ.50,000-70,000 ఉంటోంది. మీ అమ్మానాన్నలతో మంచి సంబంధాలు పెట్టుకోండి. స్వతంత్రంగా ఉండటానికి ఇంటి నుంచి బయటకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు" అని ఆమె రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ వెంటనే వైరల్ గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. ముంబైలో అధిక జీవన వ్యయం నుంచి పలువురు యూజర్లు తమ సొంత అనుభవాలను పంచుకున్నారు. అప్పుల భారం లేకుండా ఇల్లు, మంచి వైద్యం, నాణ్యమైన విద్య పొందడం చాలా మందికి అసాధ్యమైన కలలా కనిపిస్తోందంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. 'ఇది 70 వేల అద్దె లేదా ఈఎంఐనా?' అని ప్రశ్నిస్తూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "నేను ఈ నగరం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. ఈ అద్దెను నేను భరించలేను" అంటూ ఇంకొక యూజర్ అసహనాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment