న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఉత్పత్తులు అన్నింటిపై ‘తయారీ తేదీ’ని, ‘యూనిట్ విక్రయ ధర’ను తప్పనిసరిగా ముద్రించాలన్న నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇలాంటి ఉత్పత్తులను వేర్వేరు పరిమాణాల్లో విక్రయిస్తారు కాబట్టి ‘యూనిట్ విక్రయ ధర’ ఎంతనేది వినియోగదారులకు తెలియాల్సిన అవసరం ఉందని, తద్వారా వారు కొనుగోలు విషయంలో తగు నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.
గతంలో ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై తయారీ తేదీని లేదా దిగుమతి చేసుకున్న తేదీని లేదా ప్యాక్ చేసిన తేదీని ముద్రించేందుకు కంపెనీలకు వెసులుబాటు ఉండేది. దాన్ని ప్రస్తుతం మార్చారు. తయారీ తేదీని ముద్రించడం వల్ల సదరు ఉత్పత్తి ఎన్నాళ్ల క్రితం తయారైనదీ వినియోగదారులకు స్పష్టంగా తెలిసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే యూనిట్ ధరను ముద్రించడం వల్ల గ్రాముల లెక్కన ఖరీదు ఎంత ఉంటోందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు 2.5 కేజీల గోధుమ పిండి ప్యాకెట్‌పై గరిష్ట చిల్లర ధరతో (ఎంఆర్‌పీ) పాటు కేజీ (యూనిట్) ధర ఎంత అనేది కూడా ముద్రించాల్సి ఉంటుంది. ఒకవేళ కేజీ కన్నా తక్కువ పరిమాణం ఉంటే ఎంఆర్‌పీతో పాటు గ్రాముకి ఇంతని ముద్రించాలి.
Comments
Please login to add a commentAdd a comment