నిరుద్యోగం విషయంలో భారత్ ముందు పెను సవాళ్లు
జాతీయ నిరుద్యోగిత రేటులో తగ్గుదల నమోదు
పర్యాటకంపై ఆధారపడిన లక్షద్వీప్‌లో అధిక నిరుద్యోగిత
పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా అధిక నిరుద్యోగ స్థాయి
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉద్యోగ అవకాశాలు
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ భారత్ నిరుద్యోగం విషయంలో పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలోని వివిధ రంగాలు వృద్ధిని చవిచూస్తున్నప్పటికీ, నిరుద్యోగితా స్థాయిలో ఆశించినంత మార్పు రాకపోవడం విశేషం.
ఇటీవలే విడుదలైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్) అందించిన నివేదిక ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి జాతీయ నిరుద్యోగిత రేటులో తగ్గుదల కనిపించింది. 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో నిరుద్యోగితా రేలు 3.2 శాతానికి తగ్గింది. ఇది 2020-21లో 4.2 శాతంగా, 2021-22లో 4.1శాతంగా ఉంది.
అగ్రస్థానంలో లక్షద్వీప్
11.1 శాతం నిరుద్యోగితా రేటుతో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉంది. పర్యాటకంపై ఆధారపడిన లక్షద్వీప్ ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించలేకపోయింది. గోవా, అండమాన్, నికోబార్ దీవులు రెండూ 9.7శాతం నిరుద్యోగితా రేటును నమోదు చేశాయి. కాలానుగుణ ఉపాధి, ప్రభుత్వ రంగ ఉద్యోగాలపై ఆధారపడటం మొదలైనవి నిరుద్యోగానికి సవాలుగా నిలిచాయి. ప్రభుత్వ రంగంలో పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా అధిక నిరుద్యోగ స్థాయి కొనసాగుతోంది.
వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్న కేరళ యువత
నాగాలాండ్, కేరళ వరుసగా 9.1శాతం, 7.0శాతం రేట్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. కేరళలోని యువత అధిక అక్షరాస్యత, తక్కువ ఉపాధి అవకాశాలనే వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తర భారతదేశంలో, హర్యానా పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పటికీ 6.1% నిరుద్యోగిత రేటును నమోదు చేసింది. పారిశ్రామిక వృద్ధి ఒక్కటే ఉపాధికి హామీ ఇవ్వదని ఈ వైరుధ్యం సూచిస్తుంది.
చండీగఢ్, మేఘాలయాలకు పలు సవాళ్లు
అదేవిధంగా 6.0శాతం నిరుద్యోగితా రేటుతో చండీగఢ్, మేఘాలయాలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. చండీగఢ్ ప్రభుత్వం, అక్కడి సేవా రంగాలు రాష్ట్రంలోని యువతకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయి. మేఘాలయలో పారిశ్రామిక అభివృద్ధి చెందకపోవడం ఉపాధికి ఆటంకంగా మారింది.
తెలంగాణలో..
జమ్ముకశ్మీర్, తెలంగాణలో నిరుద్యోగ రేటు 4.4శాతంగా ఉంది. జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ, ఆర్థిక సవాళ్లు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఐటీ రంగం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్‌ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే..
Comments
Please login to add a commentAdd a comment