
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు, అందుకు చేసిన ఖర్చుకు సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనంత్ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) స్పందించారు. ఇటీవల బ్లూమ్‌బర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
‘ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల వివాహం కోసం తమ వంతు కృషి చేయాలని కోరుకుంటారు. మేం చేసింది కూడా అదే. ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని నేను భావిస్తున్నాను’ అని అన్నారు. వేడుకల స్థాయిని పెంచుతూ భారతీయ వారసత్వాన్ని చాటాలని నీతా నొక్కి చెప్పారు. భారతీయ సంప్రదాయాలు, వారసత్వం, సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసినందుకు సంతోషంగా ఉందని ఆమె ఇంటర్వ్యూలో అన్నారు. తన కుమారుడు అనంత్ ఆస్తమా కారణంగా చిన్నప్పటి నుంచి స్థూలకాయంతో పోరాడుతున్నాడని చెప్పారు. సమస్యలున్నా ఆత్మవిశ్వాసం కలిగిన పెళ్లికొడుకుగా వేదికపైకి వచ్చాడన్నారు.
జులై 12, 2024లో ఒకటైన అనంత్ అంబానీ-రాధికమర్చెంట్‌ల వివాహం ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో చర్చకు దారితీసింది. వీరి వివాహం మూడు ప్రధాన ఘట్టాల్లో జరిగింది. 2024 మార్చిలో అంతర్జాతీయ ప్రముఖులు జామ్‌నగర్‌లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హజరయ్యారు. ఇందులో రిహానా, అకాన్, జస్టిన్ బీబర్, దిల్జిత్ దోసాంజ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. వంటి సినీతారలు కలిసి చిందేశారు. తర్వాత క్రూయిజ్ షిప్‌లో ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. చివరకు ముంబయిలోని బీకేసీలో వివాహం జరిగింది.
ఇదీ చదవండి: శాంతించిన కూరగాయలు, ఆహార ధరలు
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరయ్యారు. దాంతో వారికి సకల సౌకర్యాలు సమకూర్చేలా ఏర్పాట్లు జరిపారు. అందులో భాగంగా ప్రముఖుల కోసం ఏకంగా అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్‌లను, 100 సాధారణ విమానాలను అద్దెకు తీసుకుంది. క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా అంబానీ జెట్ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు అప్పట్లో ధ్రువీకరించారు. పెళ్లికి వచ్చిన అతిథులను తిరిగి వారి గమ్యస్థానాలను చేర్చడానికి వీటిని వినియోగిస్తారని చెప్పారు. ఇలా పెళ్లికి భారీగా ఖర్చు చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తాజాగా నీతా అంబానీ ఇంటర్వ్యూలో స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment