ఎన్‌ఎండీసీ- రెప్కో హోమ్‌.. జూమ్‌ | NMDC ltd- Repco home finance jumps | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎండీసీ- రెప్కో హోమ్‌.. జూమ్‌

Published Fri, Aug 28 2020 11:44 AM | Last Updated on Fri, Aug 28 2020 12:13 PM

NMDC ltd- Repco home finance jumps - Sakshi

వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 295 పాయింట్లు జంప్‌చేసి 39,08కు చేరగా.. నిఫ్టీ 76 పాయింట్లు ఎగసి 11,635 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌, మార్టిగేజ్‌ సంస్థ రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఎన్‌ఎండీసీ లిమిటెడ్
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో కోవిడ్‌-19 నేపథ్యంలో ఎన్‌ఎండీసీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం 55 శాతం క్షీణించి రూ. 533 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 3264 కోట్ల నుంచి రూ. 1938 కోట్లకు పడిపోయింది. అయితే లాక్‌డవున్‌ల కాలంలోనూ అంచనాలకు అనుగుణమైన పనితీరు చూపినట్లు ఎన్‌ఎండీసీ చైర్మన్‌ సుమీత్‌ దేవ్‌ పేర్కొన్నారు. ఇకపై మెరుగైన పనితీరును ప్రదర్శించగలమని అంచనా వేశారు. ఈ నెల మొదట్లో కంపెనీ ముడిఇనుము ధరలను టన్నుకి రూ. 300 చొప్పున పెంచింది. దీంతో టన్ను ధర రూ. 2,950కు చేరింది. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌ఎండీసీ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 109 వద్ద ట్రేడవుతోంది.

రెప్కో హోమ్‌ ఫైనాన్స్
రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో వాటాను ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 4.86 శాతం నుంచి 6.14 శాతానికి పెంచుకున్నట్లు తాజాగా వెల్లడైంది. జూన్‌ చివరికల్లా రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, డీఎస్‌పీ, హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ వరుసగా 2.36 శాతం, 4.44 శాతం, 5.97 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెప్కో హోమ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 186.5 వద్ద ఫ్రీజయ్యింది. గత 10 ట్రేడింగ్‌ సెషన్లలోనే ఈ షేరు 35 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement