మందుల అమ్మకాల్లో నిబంధనల ఉల్లంఘనపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ సహా 20 ఆన్‌లైన్ విక్రయ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2018లో ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లైసెన్స్ లేకుండా ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు సాగించకూడదు. ఈ మేరకు డీసీజీఐ 2019లోనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు ఇచ్చింది.
డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం-1940 చట్టాన్ని ఉల్లంఘించి లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్నందుకు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని డీసీజీఐ ఈ-మెయిల్ ద్వారా ఆన్‌లైన్ విక్రయ సంస్థలను హెచ్చరించింది.
దీనిపై ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ సంస్థ స్పందిస్తూ తాము నాణ్యమైన మందులు, ఇతర హెల్త్ కేర్ ఉత్పత్తులను స్వతంత్ర అమ్మకందారుల నుంచి సేకరించి లక్షలాది మంది వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తున్నామని తెలిపారు. డీసీజీఐ నుంచి తమకు నోటీసు అందిందని, దీనికి తగినవిధంగా స్పందిస్తామని వివరించారు. స్థానిక చట్టాలు, నిబంధనలను తాము గౌరవిస్తామని, వాటికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment