ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడురోజుల కీలక ద్వైమాసిక సమావేశాలు నేటినుంచి (4వ తేదీన) ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. అక్టోబర్ 6వ తేదీన (శుక్రవారం) ఈ భేటీ కీలక నిర్ణయాలను గవర్నర్ మీడియాకు వెల్లడిస్తారు.
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్‌బీఐ ఈ సమావేశాల్లో కూడా యథాతథంగా 6.5 శాతం వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వరుసగా నాలుగు ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథ రేటును కొనసాగించినట్లు అవుతుంది. ధరల స్పీడ్‌ను కట్టడి చేసే విషయంలో రాజీ పడేదే లేదని ఆర్‌బీఐ గవర్నర్ ఉద్ఘాటిస్తున్న సంగతి తెలిసిందే.
ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది.
జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతానికి తగ్గినప్పటికీ ఈ స్థాయి సైతం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయికన్నా 83 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment