న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల లీజింగ్ (ఆఫీస్ స్పేస్)కు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో (టాప్–8) 24.8 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్‌ఎఫ్‌టీ) ఆఫీస్ లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 66 శాతం పెరిగింది. ఆఫీస్ స్పేస్ లీజింగ్ మార్కెట్ చరిత్రలో త్రైమాసికం వారీ ఇది రెండో గరిష్ట స్థాయి.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో 66.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ మేర లీజింగ్ నమోదైంది. పూర్తి ఏడాదికి 80 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ దాటిపోతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్’ సంస్థ అంచనా వేసింది. గతేడాది టాప్–8 పట్టణాల్లో 74.5 మిలియన్ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) ఆఫీస్ స్పేస్ లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2018లో 49.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2022లో 72 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ చొప్పున లీజింగ్ నమోదైంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీస్ మార్కెట్ గణాంకాలతో కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఒక నివేదికను విడుదల చేసింది.
పటిష్ట మార్కెట్
‘‘మార్కెట్ మూలాలు బలంగా ఉండడంతో భారత ఆఫీస్ మార్కెట్లో లీజింగ్ అసాధారణ స్థాయిలో కొనసాగుతోంది. టాప్–8 పట్టణాల్లో వేకెన్సీ రేటు (ఖాళీగా ఉన్న ఆఫీస్ స్పేస్) తక్కువగా ఉండడం ఆఫీస్ వసతులకు బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది’’అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ తెలిపారు. ఈ వృద్ధిలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీఉల) కీలక పాత్ర పోషిస్తున్నాయని.. ఆవిష్కరణలు, వృద్ధికి కీలక అవుట్‌సోర్స్ మార్కెట్‌గా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తున్నాయని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక తెలిపింది.
ఇదీ చదవండి: ల్యాండ్ డీల్స్ జోరు.. టాప్‌లో హైదరాబాద్
ఇటీవలి కాలంలో సగటు త్రైమాసికం లీజింగ్ 20 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటోందని, 2024 మొత్తం మీద లీజింగ్ 80 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీని దాటుతుందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ టెనెంట్ రిప్రజెంటేషన్ ఎండీ వీరబాబు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సరఫరా పరిమితంగా ఉన్నట్టు చెప్పారు. సమీప కాలంలో సరఫరా పెరగొచ్చని.. అయినా సరే డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు.
టాప్–8 పట్టణాల్లో వేకెన్సీ రేటు 17.1 శాతంగా సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైంది. ఇది 14 త్రైమాసికాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 0.60 శాతం మేర వేకెన్సీ రేటు తగ్గింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ పట్టణాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment