సాక్షి, న్యూఢిల్లీ : ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన నేపథ్యంలో గూగుల్‌పై డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఆరోపణలు గుప్పించింది. భారత చట్టాలకు అతీతంగా గూగుల్ తన పాలసీలను రూపొందిస్తోందని పేటీఎం మండిపడింది. సెప్టెంబర్ 11న తాము తమ యూజర్ల కోసం యూపీఐ క్యాష్‌బ్యాక్‌ను ప్రారంభించామని, ఇది తమ పాలసీకి విరుద్ధమంటూ ఈనెల 18న ప్లేస్టోర్ నుంచి తమ యాప్‌ను గూగుల్ తొలగించిందని పేటీఎం వాపోయింది. తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండానే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుందని పేటీఎం ఆరోపించింది.
యూపీఐ క్యాష్‌బ్యాక్, స్క్రాచ్‌కార్డ్ ప్రచారానికి సంబంధించి గూగుల్ తమకు నోటిఫికేషన్ పంపడం ఇదే తొలిసారని వివరించింది. ఆనవాయితీకి విరుద్ధంగా వారి ఆందోళనలపై తాము స్పందించే అవకాశం కానీ, మా అభిప్రాయాలను వెల్లడించే ఆప్షన్‌ను కానీ సెర్చింజిన్ దిగ్గంజం తమకు ఇవ్వలేదని పేర్కొంది. గూగుల్ పే యాప్ కోసం భారత్‌లో గూగుల్ సైతం తరచూ ఇలాంటి స్క్రాచ్‌కార్డ్ క్యాంపెయిన్‌లు నిర్వహించిందని పేర్కొంది. భారత డిజిటల్ మార్కెట్‌లో గూగుల్ ప్రాబల్యం దేశీ ఇంటర్‌నెట్ కంపెనీలకు అనుభవమేనని పేటీఎం వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment