ముంబై: గూగుల్‌కు పోటీగా పేటీఎం రంగంలోకి దిగింది. ఇండియన్ యాప్ డెవలపర్స్ కోసం ప్రత్యేక యాండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ మినీ యాప్ స్టోర్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోకుండానే ఉపయోగించుకోవచ్చు. నేరుగా మొబైల్ వెబ్‌సైట్ ద్వారా యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని, ఇందువల్ల కోట్లాది మంది యూజర్ల డేటా ప్రైవసీకి ముప్పు ఉండదని పేటీఎం పేర్కొంది.
అందుకే ఈ కోత్త స్టోర్..
గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇటీవలే కొద్దిగంటలపాటు పేటీఎం యాప్‌ను తొలగించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పేటీఎం సొంతగా యాప్ స్టోర్‌ను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తక్కువ ఖర్చుతో హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ ఆధారంగా డెవలప్ చేసిన యాప్స్‌కి కూడా తమ ప్లేస్టోర్‌లో చోటు దక్కుతుందని పేటీఎం స్పష్టం చేసింది.
ఇప్పటికే 300కు పైగా యాప్స్..
1ఎంజీ, నెట్‌మెడ్స్, డిజిట్, డెకథ్లాన్ తదితర 300 సంస్థలు తమ ప్లేస్టోర్ కోసం యాప్స్ డెవలప్ చేశాయని పేటీఎం తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. మన దేశానికి చెందిన ప్రతి యాప్ డెవలపర్‌కి అవకాశం కల్పించడంలో భాగంగానే ఈ మినీ యాప్ స్టోర్‌ను ప్రారంభించామని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్‌శేఖర్‌శర్మ తెలిపారు. ఇండియన్ స్టార్టప్స్‌కు మున్ముందు మరిన్ని అవకాశాలిస్తామని వెల్లడించారు. (చదవండి: పేటీఎంకు గూగుల్ షాక్)
కమిషన్ చెల్లించక్కర్లేదు..
గూగుల్ ప్లేస్టోర్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేస్తే 30 శాతం కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ తమ మినీ యాప్ స్టోర్ పేమెంట్ గేట్ ద్వారా యాప్స్ లిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సేవలను చార్జీలు లేకుండా అందించనున్నట్టు పేటీఎం తెలిపింది. పేటీఎం మినీ యాప్ స్టోర్‌లో యాప్స్ లిస్ట్ చేసిన డెవలపర్లు పేటీఎం వాలెట్, పేమెంట్స్ బ్యాంకింగ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ చెల్లింపు సేవలను తమ యాప్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చని వెల్లడించింది. (చదవండి: డిజిటల్ మార్కెట్‌పై గూగుల్ పెత్తనం)
Comments
Please login to add a commentAdd a comment