ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఆటుపోట్ల మార్కెట్లోనూ రెండు మిడ్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఓవైపు ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్, మరోపక్క ఫార్మా రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్ కౌంటర్ జోరందుకున్నాయి. భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
పెర్సిస్టెంట్ సిస్టమ్స్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నికర లాభం 7.4 శాతం పెరిగి రూ. 90 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 6 శాతం బలపడి రూ. 1013 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన నిర్వహణ లాభం 15 శాతం పుంజుకుని రూ. 115 కోట్లకు చేరగా.. మార్జిన్లు 14.7 శాతంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 857 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 919 వరకూ జంప్‌చేసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!
ఆర్తి డ్రగ్స్ లిమిటెడ్
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఆర్తి డ్రగ్స్ నికర లాభం 281 శాతం జంప్‌చేసి రూ. 85 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 35 శాతం పెరిగి రూ. 546 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే నికర లాభం 45 శాతం పుంజుకోగా.. ఆదాయం 21 శాతం బలపడింది. ఈ నేపథ్యంలో ఆర్తి డ్రగ్స్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 1766 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1805 వరకూ జంప్‌చేసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment