విలేకరుల సమావేశంలో ప్రాట్ అండ్ విట్నీ ఇండియా కంట్రీ హెడ్ అస్మితా సేఠి (పక్కన కంపెనీ ప్రతినిధులు)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన ఇంజిన్ల తయారీ దిగ్గజం ప్రాట్ అండ్ విట్నీ తాజాగా బెంగళూరులో ’ఇండియా కేపబిలిటీ సెంటర్’ (ఐసీసీ)ని ఏర్పాటు చేస్తోంది. ఇది వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. తమ సరఫరా వ్యవస్థకు అవసరమైన సేవలను అందించేందుకు ఇది ఈ సెంటర్ ఉపయోగపడగలదని కంపెనీ భారత విభాగం హెడ్ అస్మితా సేఠి చెప్పారు. దీనికోసం ప్రాథమికంగా 150 మంది పైగా ఏరోస్పేస్ అనలిస్టులు, డేటా సైంటిస్టులు మొదలైన నిపుణులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ఆమె వివరించారు.
భారత్‌లో తాము ఈ తరహా సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని గురువారమిక్కడ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అస్మితా చెప్పారు. కంపెనీకి ఇప్పటికే బెంగళూరులో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది. అలాగే, ప్రస్తుతం హైదరాబాద్‌లో కస్టమర్ ట్రెయినింగ్ సెంటర్ కూడా ఉంది. దేశీయంగా ప్రతి ఇద్దరు విమాన ప్రయాణికుల్లో ఒకరు తమ కంపెనీ ఇంజిన్ ఉపయోగించే ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ప్రయాణిస్తున్నారని అస్మితా చెప్పారు. భారత్‌లో తమ ఇంజి న్లు, ఆక్సిలరీ పవర్ యూనిట్లు ప్రస్తుతం 1700 పైచిలుకు వినియోగంలో ఉన్నాయని తెలిపారు.
ఎంఆర్‌వో కేంద్రంపై దృష్టి..
భారత్‌లో ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్‌వో) సర్వీసులను ప్రారంభించే అవకాశాలకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని ఆమె వివరించారు. ప్రస్తుతం బిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే ఎంఆర్‌వో పనుల కోసం సింగపూర్, మధ్య ప్రాచ్యం, హాంకాంగ్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వస్తోందని అస్మితా చెప్పారు. ఈ నేపథ్యంలో సింగపూర్ తరహా ప్రోత్సాహకాలు ఇస్తే దేశీయంగానే ఎంఆర్‌వో కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment