Pratt and Whitney
-
బెంగళూరులో ప్రాట్ అండ్ విట్నీ ఇంజినీరింగ్ సెంటర్
ముంబై: విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ తాజాగా బెంగళూరులో తమ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ (ఐఈసీ)ని ప్రారంభించింది. దాదాపు రూ. 295 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 50 మంది పైగా సిబ్బంది ఉండగా, వచ్చే నాలుగేళ్లలో 450 మందిని తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రాట్ అండ్ విట్నీ ఇండియా కేపబిలిటీ సెంటర్, కోలిన్స్ ఏరోస్పేస్ సెంటర్‌తో పాటు అమెరికా, కెనడా తదితర దేశాల్లోని కార్యాలయాలతో ఐఈసీ కలిసి పనిచేయనుంది. దేశీయంగా పటిష్టమైన ఏరోస్పేస్ వ్యవస్థను నిర్మించడంపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ హంట్ తెలిపారు. -
భారత్‌లో ప్రాట్ అండ్ విట్నీ ’కేపబిలిటీ కేంద్రం’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన ఇంజిన్ల తయారీ దిగ్గజం ప్రాట్ అండ్ విట్నీ తాజాగా బెంగళూరులో ’ఇండియా కేపబిలిటీ సెంటర్’ (ఐసీసీ)ని ఏర్పాటు చేస్తోంది. ఇది వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. తమ సరఫరా వ్యవస్థకు అవసరమైన సేవలను అందించేందుకు ఇది ఈ సెంటర్ ఉపయోగపడగలదని కంపెనీ భారత విభాగం హెడ్ అస్మితా సేఠి చెప్పారు. దీనికోసం ప్రాథమికంగా 150 మంది పైగా ఏరోస్పేస్ అనలిస్టులు, డేటా సైంటిస్టులు మొదలైన నిపుణులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ఆమె వివరించారు. భారత్‌లో తాము ఈ తరహా సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని గురువారమిక్కడ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అస్మితా చెప్పారు. కంపెనీకి ఇప్పటికే బెంగళూరులో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది. అలాగే, ప్రస్తుతం హైదరాబాద్‌లో కస్టమర్ ట్రెయినింగ్ సెంటర్ కూడా ఉంది. దేశీయంగా ప్రతి ఇద్దరు విమాన ప్రయాణికుల్లో ఒకరు తమ కంపెనీ ఇంజిన్ ఉపయోగించే ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ప్రయాణిస్తున్నారని అస్మితా చెప్పారు. భారత్‌లో తమ ఇంజి న్లు, ఆక్సిలరీ పవర్ యూనిట్లు ప్రస్తుతం 1700 పైచిలుకు వినియోగంలో ఉన్నాయని తెలిపారు. ఎంఆర్వో కేంద్రంపై దృష్టి.. భారత్‌లో ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) సర్వీసులను ప్రారంభించే అవకాశాలకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని ఆమె వివరించారు. ప్రస్తుతం బిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే ఎంఆర్వో పనుల కోసం సింగపూర్, మధ్య ప్రాచ్యం, హాంకాంగ్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వస్తోందని అస్మితా చెప్పారు. ఈ నేపథ్యంలో సింగపూర్ తరహా ప్రోత్సాహకాలు ఇస్తే దేశీయంగానే ఎంఆర్వో కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చని ఆమె పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ప్రాట్ అండ్ విట్నీ శిక్షణ కేంద్రం
అమెరికా, చైనా కేంద్రాల తర్వాత ఇది మూడోది - ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ - ఇండియా నుంచి 600 విమాన ఇంజిన్ల ఆర్డరు : ప్రాట్ అండ్ విట్నీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు అంతర్జాతీయ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ ప్రకటించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 7,000 విమాన ఇంజిన్లకు ఆర్డర్లు రాగా అందులో కేవలం 600 ఇండియా నుంచే వచ్చినట్లు ప్రాట్ అండ్ విట్నీ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ ఇంజిన్స్ -ఏషియా పసిఫిక్) మేరీ ఎల్లెన్ ఎస్ జోన్స్ తెలిపారు. మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం, ఇంధన ధరలు తగ్గడంతో దేశీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ఇండిగో, గోఎయిర్, ఎయిర్కోస్టా వంటి దేశీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడమే దీనికి నిదర్శనమన్నారు. అంతకుముందు ప్రాట్ అండ్ విట్నీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వినియోగదారుల (ఇంజిన్లు ఉపయోగించే ఎయిర్‌లైన్స్ కంపెనీల సిబ్బంది) శిక్షణ కేంద్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అమెరికా, చైనా తర్వాత ఇది మూడవ కేంద్రమని, ఈ కేంద్రంలో జీటీఎఫ్, వీ2500 ఇంజిన్లపై వినియోగదారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కేంద్రంలో 2,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వవచ్చని, దీన్ని త్వరలోనే 4,000 మందికి విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ సంస్థలో 1500 మంది పనిచేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పరిశీలన దశలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు దేశీయ విమానయాన రంగాన్ని ప్రోత్సహించే విధంగా కొత్త విమానయాన విధానం ఉంటుందని అశోక్ గజపతి రాజు తెలిపారు. ఇప్పటికే ఉన్న సంస్థలతో పాటు కొత్త సంస్థలను ప్రోత్సహించే విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు. 5/20 నిబంధనను రద్దు చేయాలన్న ఆలోచనపై చెలరేగుతున్న వివాదంపై స్పందిస్తూ... పరిశ్రమ వృద్ధిని నియంత్రించే చర్యలను తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తానన్నారు. ఐదేళ్లు దేశీయంగా విమానాలు నడిపి, కనీసం విమానాల సంఖ్య 20 వున్న సంస్థలకే విదేశీ సర్వీసులు నిర్వహించేందుకు అనుమతివ్వడానికి నిర్దేశించిన నిబంధనను 5/20గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం పౌర విమానయానరంగంలో వృద్ధి బాగానే ఉందని, సరుకు రవాణాలో కూడా వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం సమీపంలో నిర్మించతలపెట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు ఇంకా పరిశీలన దశలోనే ఉందని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. -
సైయంట్ నికర లాభం రూ. 68 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సర్వీసుల కంపెనీ సైయంట్ (గతంలో ఇన్ఫోటెక్) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక నికర లాభంలో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2013-14 తొలి త్రైమాసికంలో రూ.54 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 68 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 28 శాతం వృద్ధితో రూ. 483 కోట్ల నుంచి రూ. 621 కోట్లకు పెరిగింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా త్రైమాసిక ఆదాయం 100 మిలియన్ డాలర్ల మార్కును అందుకుందని, కొత్త కంపెనీలను టేకోవర్ చేయడం వంటివి లేకుండానే ఈ మార్కును అందుకున్నామని సైయంట్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో కృష్ణ భోధనపు పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని యూనిట్లు మంచి పనితీరు కనపర్చాయని, ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 12.3 శాతం వృద్ధి నమోదయ్యిందన్నారు. సమీక్షాకాలంలో నిర్వహణా లాభం తగ్గడంపై కృష్ణ స్పందిస్తూ డాలరు విలువ క్షీణత, జీతాల పెంపుతో మార్జిన్లపై ఒత్తిడి ఉందని, రానున్న కాలంలో మార్జిన్లు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్షా కాలంలో నికరంగా 445 మంది ఉద్యోగులను చేర్చుకోగా, ఇంజనీరింగ్ విభాగంలో ఆరుగురు, డీఎన్‌వో విభాగంలో ముగ్గురు క్లెయింట్లు చేరారు. విమాన విడిభాగాల ప్రదర్శన కేంద్రం అతర్జాతీయంగా విమాన ఇంజన్ల తయారీలో పేరొందిన ప్రాట్ అండ్ విట్నీ(పీడబ్ల్యూ)తో కలిసి సైయంట్ హైదరాబాద్‌లో విమాన విఢిభాగాల ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎక్స్పీరియన్స్ కేంద్రంలో పీడబ్ల్యూ 4090 భారీ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్‌తో పాటు, వివిధ కంపెనీలకు చెందిన విమాన తయారీ యంత్రాలను ప్రదర్శనకు ఉంచారు. మణికొండలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సైయంట్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డితో పాటు, పీడబ్ల్యూ వైస్ ప్రెసిడెంట్ జయంత్ సబనీస్లు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయి విమాన విడిభాగాలను నేరుగా చూడటం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు మరింతగా నాలెడ్జ్‌ను పెంచుకునే అవకాశం కలుగుతుందన్నారు.