ఒకే రోజు 13 కంపెనీల క్యూ
సెబీకి ప్రాస్పెక్టస్‌ల దాఖలు
రూ. 8,000 కోట్ల సమీకరణకు సై
సెకండరీ మార్కెట్లను మించుతూ ప్రైమరీ మార్కెట్ సైతం సరికొత్త రికార్డులవైపు పరుగు తీస్తోంది. జనవరి నుంచి ఇప్పటికే 62 కంపెనీలు ఐపీవోలకురాగా.. తాజాగా ఒకే రోజు 13 కంపెనీలు సెబీని ఆశ్రయించాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్‌డెస్క్
రిటైల్ ఇన్వెస్టర్ల దన్ను, సెకండరీ మార్కెట్ల జోష్ పలు అన్‌లిస్టెడ్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. దీంతో నిధుల సమీకరణతోపాటు.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. వెరసి తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఒకే రోజు 13 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి.
ఈ జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్‌స్ట్రక్షన్స్ తదితరాలు చేరాయి. ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ ఏడాది(2024) ఇప్పటివరకూ 62 కంపెనీలు రూ. 64,000 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. గతేడాది(2023) మొత్తంగా 57 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 49,436 కోట్లతో పోలిస్తే ఇది 29% అధికం!
జాబితా ఇలా
తాజాగా సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసిన కంపెనీల జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్‌స్ట్రక్షన్స్, అజాక్స్ ఇంజినీరింగ్, రహీ ఇన్‌ఫ్రాటెక్, విక్రన్ ఇంజినీరింగ్, మిడ్‌వెస్ట్, వినే కార్పొరేషన్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, జారో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, అల్ టైమ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్, స్కోడా ట్యూబ్స్, దేవ్ యాక్సిలరేటర్ చోటు చేసుకున్నాయి.
ఈ సంస్థలన్నీ కలసి రూ. 8,000 కోట్లవరకూ సమీకరించనున్నట్లు అంచనా. విస్తరణ ప్రణాళికలు, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, ప్రస్తుత వాటాదారుల వాటా విక్రయం తదితర లక్ష్యాలతో కంపెనీలు ఐపీవో బాట పడుతున్నట్లు నిపుణులు వివరించారు.
సమీకరణ తీరిదీ
ఐపీవోలో భాగంగా సోలార్ మాడ్యూల్ తయారీ కంపెనీ విక్రమ్ సోలార్ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.74 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఆదిత్య ఇన్ఫోటెక్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
ఇక వరిండెరా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. ప్రమోటర్లు రూ. 300 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ బాటలో ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ జారీసహా.. రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు.
కారణాలున్నాయ్
ప్రైమరీ మార్కెట్ల జోరుకు పలు సానుకూల అంశాలు దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, రంగాలవారీగా అనుకూలతలు, నిధుల లభ్యత, రిటైల్‌సహా సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి తదితరాలను ప్రస్తావించారు. దేశీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు ప్రవహిస్తుండటం, యూఎస్‌లో వడ్డీ రేట్ల కోత సైతం ఇందుకు తోడ్పాటునిస్తున్నట్లు ఈక్విరస్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలియజేశారు.
కోవిడ్–19, సబ్‌ప్రైమ్ సంక్షోభం, 2011 సెపె్టంబర్ ఉగ్రదాడి తదితర అనూహ్య విపరిణామాలు సంభవిస్తే తప్ప మార్కెట్లు పతనంకాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో 2025లో మార్కెట్ సరికొత్త రికార్డులను నెలకొల్పడంతోపాటు.. మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment