‘క్రిప్టో’ ట్యాక్సేషన్‌తో చిన్న ఇన్వెస్టర్లకు సమస్యలు | Problems for small investors with crypto taxation | Sakshi
Sakshi News home page

‘క్రిప్టో’ ట్యాక్సేషన్‌తో చిన్న ఇన్వెస్టర్లకు సమస్యలు

Published Thu, Mar 17 2022 5:55 AM | Last Updated on Thu, Mar 17 2022 5:55 AM

Problems for small investors with crypto taxation - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వర్చువల్‌ అసెట్స్‌పై ప్రతిపాదిత పన్ను.. పెద్ద ఇన్వెస్టర్ల కన్నా చిన్న ఇన్వెస్టర్లకే ఎక్కువ ప్రతికూలంగా ఉంటుందని క్రిప్టో ఎక్సే్చంజ్‌ జియోటస్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో విక్రమ్‌ సుబ్బురాజ్‌ తెలిపారు. అలాగే లావాదేవీలపై టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్టెట్‌ ఎట్‌ సోర్స్‌) ప్రతిపాదన వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వంతో పరిశ్రమ చర్చలు జరపనున్నట్లు ఆయన వివరించారు. క్రిప్టో అసెట్స్‌లో లావాదేవీలు సురక్షితంగా జరిగేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థల తరహాలోనే తాము కూడా కేవైసీ (కస్టమర్ల వివరాల ధ్రువీకరణ) నిబంధనలు అన్నింటినీ పాటిస్తున్నామని విక్రమ్‌ చెప్పారు.

ప్రస్తుతం దేశీయంగా సుమారు 12 క్రిప్టో ఎక్సే్చంజీలు ఉన్నాయని, వీటి ద్వారా నెలకు రూ. 3,000 కోట్ల పైచిలుకు విలువ చేసే లావాదేవీలు జరుగుతున్నాయని బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇందులో సింహభాగం వాటా టాప్‌ 5 సంస్థలదే ఉంటోందని ఆయన తెలిపారు. నెలకు దాదాపు రూ. 500 కోట్ల విలువ చేసే లావాదేవీలు తమ ప్లాట్‌ఫాంపై జరుగుతున్నాయని పేర్కొన్నారు.  క్రిప్టో కరెన్సీల బాస్కెట్‌లో అత్యంత తక్కువగా రూ. 100 నుంచి సిప్‌ పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నామని విక్రమ్‌ తెలిపారు. రిస్కులు తగ్గించుకునే క్రమంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో క్రిప్టో సాధనాలపై పెట్టుబడులను రెండు శాతానికి పరిమితం చేసుకోవడం శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

పోల్

 
Advertisement