కేంద్రం జులై 23న ప్రవేశపెట్టే బడ్జెట్ 2024-25లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) పెంచుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా రానున్న బడ్జెట్‌లో ప్రకటనలు వెలువడుతాయని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.
భారతదేశ ఆర్థిక వృద్ధి, ఉపాధిని పెంపొందించేందుకు తోడ్పడే తయారీ రంగానికి కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది. 2024 ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పీఎల్‌ఐ పథకంలో భాగంగా తయారీ రంగానికి రూ.6,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మునుపటి సంవత్సరం అంచనా రూ.4,645 కోట్లతో పోలిస్తే 33% ఎక్కువగా ఉంది. ఈ నిధులు మొబైల్ ఫోన్‌లు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి 14 రంగాల్లో ఉత్పత్తుల తయారీకి, సప్లై చైన్‌కు ఉపయోగపడుతాయని మంత్రి చెప్పారు. అయితే ఈసారి పూర్తికాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో తయారీ రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2021లో పీఎల్‌ఐ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి తయరీ రంగం రూ.1.03 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించింది. దీని వల్ల రూ.8.61 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, విక్రయాలు జరిగాయి. ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 6.78 లక్షల మందికి పైగా ఉపాధి కలిగినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. అయితే, లెదర్, గార్మెంట్స్, హాండ్లూమ్స్, నగలు, తోలు, వస్త్రాల తయారీ వంటి రంగాల్లో పరిమితంగానే ఉపాధి లభించింది. ఈ పరిశ్రమలపై తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందినవారు చాలా మంది ఆధారపడుతారు. దీనిపై మరింత కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: బడ్జెట్‌లో ‘ఫేమ్ 3’ ప్రకటన ఉండదు: కేంద్రమంత్రి
ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికాం ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే పీఎల్‌ఐ పథకం ద్వారా రూ.3.20 లక్షల కోట్లకు మించి ఎగుమతులు జరిగాయి. రాబోయే ఐదేళ్లలో ఉత్పత్తి, ఉపాధి, ఆర్థిక వృద్ధిని మరింత పెంచడమే ఈ పథకం దీర్ఘకాలిక లక్ష్యం. పీఎల్‌ఐ పరిధిలోని 14 రంగాలలో మొత్తం 746 దరఖాస్తులు ఆమోదించారు. ఈ రంగాల్లో రానున్న రోజుల్లో దాదాపు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment