ఈ ఏడాది రూ. 15,000 కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్చితో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో భారీ డివిడెండ్‌ను చెల్లించే వీలుంది. ఇందుకు లాభదాయకత మెరుగుపడటం సహకరించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది పీఎస్‌యూ బ్యాంకులు రూ. 15,000 కోట్లకుపైగా డివిడెండును చెల్లించే అవకాశముంది. ఈ ఏడాది ఇప్పటికే తొలి మూడు త్రైమాసికాల(ఏప్రిల్–డిసెంబర్)లో 12 పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 98,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి.
గతేడాది(2022–23)లో ఉమ్మడిగా సాధించిన నికర లాభానికంటే రూ. 7,000 కోట్లుమాత్రమే తక్కువ. గతేడాదిలోనే ప్రభుత్వ బ్యాంకులు చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. అంతక్రితం ఏడాది(2021–22)లో కేవలం రూ. 66,540 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది ప్రభుత్వం పీఎస్‌యూ బ్యాంకుల నుంచి 58 శాతం అధికంగా రూ. 13,804 కోట్ల డివిడెండ్‌ను అందుకుంది.
అంతక్రితం ఏడాదిలో రూ. 8,718 కోట్ల డివిడెండ్ మాత్రమే చెల్లించాయి. వెరసి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ప్రభుత్వానికి పీఎస్‌యూ బ్యాంకులు డివిడెండును చెల్లించనున్నట్లు అంచనా. కాగా.. ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 6 శాతానికంటే తక్కువగా నమోదైన బ్యాంకులు మాత్రమే డివిడెండ్ ప్రకటించేందుకు వీలుంటుంది. అయితే వచ్చే ఏడాది(2024–25) నుంచి మాత్రమే తాజా మార్గదర్శకాలు అమలుకానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment