
మీరు 30 నిమిషాల్లో చనిపోతారని ఎవరైనా చెబితే మీరు ఎలా స్పందిస్తారు? కొందరు షాక్‌కు గురవుతారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు, కొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు. మరణం అంచుదాకా వెళ్ళినప్పుడు కూడా రతన్ టాటా ఎలా ఉన్నారో ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ వివరించారు.
'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమణి' అనే పోడ్‌కాస్ట్‌లో ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ మాట్లాడుతూ.. నేను (శివశంకరన్), రతన్ టాటా సింగపూర్ నుంచి సీషెల్స్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, ఓ భయంకరమైన వార్త వినపడింది. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిల్ అయింది. రెండోది కూడా విఫలమైతే 30 నిమిషాల్లో క్రాష్ అయ్యే అవకాశం ఉందని టాటా సెక్రటరీ ఒకరు వెల్లడించారు.
ఈ వార్త వినగానే మరణం చాలా దగ్గరగా ఉందని తెలియగానే నా మనసులో ఆలోచన వచ్చింది. వెంటనే నా జీ మెయిల్ పాస్‌వర్డ్‌ను నా కొడుకుకు ఈ-మెయిల్ ద్వారా షేర్ చేస్తూ.. నేను ఇంకా ఎక్కువ రోజులు జీవించాలని అనుకుంటున్నానని చెప్పాను. అయితే నేను చనిపోతున్నానని ఆ సమయంలో రాజీ పడ్డాను అని శివశంకరన్ పేర్కొన్నారు.
ఆ సమయంలో రతన్ టాటా మాత్రం నిశ్శబ్దంగా.. ఏ మాత్రం కలవరపడకుండా కనిపించరు. పైలట్లను వారి పనిని చేయనివ్వండి అని అతను చెప్పారు. అదృష్టవశాత్తూ రెండో ఇంజన్ ఫెయిల్ కాకపోవడంతో మేమిద్దరం ప్రమాదం నుంచి బయటపడ్డామని అన్నారు.
విమానం ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందుగానే విమానాశ్రయంలో అంబులెన్స్‌లు అగ్నిమాపక సిబ్బంది నిలబడి ఉండడం చూశాను. ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన తర్వాత మంటలు చెలరేగకుండా రక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించినట్లు శివశంకరన్ వివరించారు.