Seychelles
-
ఆ సమయంలో కూడా 'రతన్ టాటా' భయపడలేదు: శివశంకరన్
మీరు 30 నిమిషాల్లో చనిపోతారని ఎవరైనా చెబితే మీరు ఎలా స్పందిస్తారు? కొందరు షాక్‌కు గురవుతారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు, కొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు. మరణం అంచుదాకా వెళ్ళినప్పుడు కూడా రతన్ టాటా ఎలా ఉన్నారో ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ వివరించారు.'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమణి' అనే పోడ్కాస్ట్లో ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సీ శివశంకరన్ మాట్లాడుతూ.. నేను (శివశంకరన్), రతన్ టాటా సింగపూర్ నుంచి సీషెల్స్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, ఓ భయంకరమైన వార్త వినపడింది. విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిల్ అయింది. రెండోది కూడా విఫలమైతే 30 నిమిషాల్లో క్రాష్ అయ్యే అవకాశం ఉందని టాటా సెక్రటరీ ఒకరు వెల్లడించారు.ఈ వార్త వినగానే మరణం చాలా దగ్గరగా ఉందని తెలియగానే నా మనసులో ఆలోచన వచ్చింది. వెంటనే నా జీ మెయిల్ పాస్‌వర్డ్‌ను నా కొడుకుకు ఈ-మెయిల్ ద్వారా షేర్ చేస్తూ.. నేను ఇంకా ఎక్కువ రోజులు జీవించాలని అనుకుంటున్నానని చెప్పాను. అయితే నేను చనిపోతున్నానని ఆ సమయంలో రాజీ పడ్డాను అని శివశంకరన్ పేర్కొన్నారు.ఆ సమయంలో రతన్ టాటా మాత్రం నిశ్శబ్దంగా.. ఏ మాత్రం కలవరపడకుండా కనిపించరు. పైలట్లను వారి పనిని చేయనివ్వండి అని అతను చెప్పారు. అదృష్టవశాత్తూ రెండో ఇంజన్ ఫెయిల్ కాకపోవడంతో మేమిద్దరం ప్రమాదం నుంచి బయటపడ్డామని అన్నారు.విమానం ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషం ముందుగానే విమానాశ్రయంలో అంబులెన్స్‌లు అగ్నిమాపక సిబ్బంది నిలబడి ఉండడం చూశాను. ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన తర్వాత మంటలు చెలరేగకుండా రక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించినట్లు శివశంకరన్ వివరించారు. -
ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా?
భూమ్మీద అత్యంత పురాతన కాలం నాటి జంతువులు ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాయంటే నమ్ముతారా?. నో ఛాన్స్ అంతరించిపోయే ఉంటాయని కచ్చితంగా చెబుతాం. అది అబద్ధం... నేనింకా బతికే ఉన్నానంటోంది ఈ తాబేలు. దీని వయసెంతో వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఎందుకంటే ఇది డైనసర్ల కాలం నుంచి ఉంది. ఒకరకరంగా చెప్పాలంటే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల కాలం నుంచి ఉన్న జీవిగా ఈ తాబేలుని పేర్కొనవచ్చు. ఆ తాబేలు ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం! ఈ తాబేలు పేరు జోనాథన్. ఇది బ్రిటన్‌లోని సెయింట్ హెలెనాలో ఉంది. ఆ ద్వీపానికి చేరుకునేటప్పటికే ఈ తాబేలు వయసు 50 ఏళ్లు. అప్పటికే పూర్తిగి పరిణితి చెంది ఉంది. అందువల్ల ఇది సుమారు 1832లో జన్మించాడని చెబుతుంటారు దీని సంరక్షకులు. లేదా అంతకంటే పెద్దవాడైనా అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పడది తన 191వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇప్పుడూ దీన్నే చూస్తే పురాతన కాలం నాటి కొన్ని జీవులు ఇంకా బతికే ఉన్నాయని ఒప్పుకుంటారు కదూ. అయితే తాబేలు జీవిత కాలం 60 నుంచి 150 ఏళ్లు. ఐతే కొన్ని మాత్రం 200 ఏళ్ల వరకు జీవిస్తాయని చాలా మంది చెబుతుంటారు. బహుశా ఈ జోనాథన్ తాబేలు కూడా ఆ కోవకు చెందిందేనేమో!. అయితే అలాంటి తాబేలు భారత్‌లోని కొలకతాలో కూడా ఉందట. దాని పేరు అద్వైత. ఇది ఏకంగా 255 ఏళ్లు జీవించినట్లు చెబుతున్నారు. తాబేలుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు శిరచ్ఛేదం చేసిన తాబేలు చనిపోదట. తల నరికిన 23 రోజుల వరకు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయట. చైనా వాళ్లు దీన్ని దీర్ఘాయువుకి చిహ్నంగా భావిస్తారట. అంతేగాదు తాబేలు మెదడును శస్త్రచికిత్స ద్వారా తొలగించిన మరణించదట. పైగా మెదడును తొలగించిన ఆరు నెలల వరకు కూడా బతికే ఉంటుందట The world’s oldest living land animal - the Seychelles giant tortoise named Jonathan - has just celebrated his 191st birthday. His age is an estimate, based on the fact that he was fully mature when he arrived on the island in 1882.pic.twitter.com/t4hpd73KsE — Massimo (@Rainmaker1973) December 4, 2023 (చదవండి: దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?) -
ఊహించని పరిణామం: ఇలాంటి వేటను అస్సలు చూసి ఉండరు!
Giant Tortoise Hunt Small Birds Video: తాబేలు-కుందేలు కథ గుర్తింది కదా!. కుందేలు బద్ధకం కలిసొచ్చి.. నత్తనడకతోనే పరుగు పందెంలో విజయం సాధిస్తుంది తాబేలు. అటుపై తాబేలు కథలెన్నో వాటిపై సింపథినీ, అదొక సాధు జీవి అనే మార్క్‌ను మనుషులకు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో.. ఆ మార్క్‌ను పూర్తిగా చెరిపిపడేయడం ఖాయం. సాధారణంగా సెచెల్లెస్ తాబేళ్లు శాఖాహార జీవులు. అలాంటిది ఈ భారీ ఆడ తాబేలు.. ఇలా వేటాడింది. తూర్పు ఆఫ్రికా సెచెల్లెస్ దీవుల సముదాయంలోని ఫ్రెగేట్ ఐల్యాండ్‌లో కిందటి నెలలో ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐల్యాండ్‌లో మూడు వేలకు పైగా తాబేళ్లు ఉన్నాయి. జీవావరణంలో మొట్టమొదటిసారి ఇలాంటి దాడిని చూడడమని పరిశోధకులు తేల్చేశారు. సెచెల్లెస్ తాబేళ్ల నుంచి కచ్చితంగా ఇది ఊహించని పరిణామమేనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ జువాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ గెర్లాచ్ చెబుతున్నారు. సెచెల్లెస్ తాబేళ్లలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రవర్తన పెరిగి ఉండొచ్చని ఆయన అంచనా వేస్తూ రాసిన కథనం.. కరెంట్బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా ప్రభావం! తాబేళ్లకు కోపం, చికాకు వచ్చినప్పుడు దాడులు చేయడం సహజం. అయితే ఈ మధ్యకాలంలో పక్షుల గూడుల నుంచి పడిపోయిన పిల్లలను, గుడ్లను సెచెల్లెస్ తాబేళ్లు తింటున్నాయనే ప్రచారాలు వినిపించాయి. అయితే చాలామంది పరిశోధకులు ఈ కథనాలను నమ్మలేదు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో అది నిజమనే ఓ అంచానికి వచ్చారు. కరోనా ప్రభావం వల్ల తాబేళ్ల జనాభా విపరీతంగా పెరగడం, వాటికి సరైన ఆహారం అందకపోవడం, గుడ్ల కోసం కావాల్సిన కాల్షియం దొరక్కపోవడం.. తదితర కారణాల వల్ల ఇవి ఇలా క్రూరంగా తయారై ఉంటాయని, అయితే వాటిని జీవన విధానానికి విరుద్ధంగా ప్రవర్తించే క్రమంలో అవి మనుగడ కొనసాగించగలవా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం పరిశీలన తప్పదని ప్రముఖ హెర్పటాలజిస్ట్ జేమ్స్ గిబ్స్ చెప్తున్నారు. చదవండి: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం! -
అసంప్షన్ ద్వీపంపై ముందడుగు
న్యూఢిల్లీ: సీషెల్స్‌లోని అసంప్షన్ ద్వీపంలో నౌకాదళ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నేవల్ బేస్ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్, సీషెల్స్ మధ్య అంగీకారం కుదిరింది. భారత పర్యటనలో ఉన్న సీషెల్స్ అధ్యక్షుడు డేనీ ఫార్, ప్రధాని మోదీ మధ్య సోమవారం జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో హిందూ మహాసముద్రంలో భారత్ ప్రభావం పెరగనుంది. మోదీ, ఫార్ మధ్య సోమవారం రక్షణతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపైనా చర్చలు జరిగాయి. సీషెల్స్‌కు 10కోట్ల డాలర్ల (దాదాపు రూ.680కోట్లు ) రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. దీని ద్వారా సీషెల్స్‌లో మిలటరీ మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని ఫార్ పేర్కొన్నారు. మా లక్ష్యం ఒక్కటే!: మోదీ ‘భారత్, సీషెల్స్‌లు కీలక వ్యూహాత్మక భాగస్వాములు. ప్రజాస్వామ్య విలువలను ఇరుదేశాలు గౌరవిస్తాయి. హిందూ మహాసముద్రంలో శాంతి భద్రతలు, సుస్థిరత నెలకొనాలన్నది మా లక్ష్యం’ అని మోదీ అన్నారు. 2015లో సీషెల్స్ పర్యటనలో హామీ ఇచ్చినట్లుగా.. డార్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సీషెల్స్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ద్వీప సముదాయ దేశ రక్షణ సామర్థ్యం, తీర ప్రాంత మౌలికవసతులు పెంచుకునేందుకు భారత్ అన్ని విధాలా సాయం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. సీషెల్స్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ, తీరప్రాంత భద్రత, వైట్ షిప్పింగ్ (మిలటరీయేతర వాణిజ్య నౌకల రవాణాపై సమాచార మార్పిడి), సీషెల్స్ దౌత్యాధికారులకు శిక్షణ (ఇరుదేశాల విదేశాంగ శాఖల మధ్య), గోవా సిటీ కార్పొరేషన్– సిటీ ఆఫ్ విక్టోరియా (సీషెల్స్) మధ్య పరస్పర సహకారంపై ఒప్పందాలు కుదిరాయి. భారత రాష్ట్రపతి కోవింద్ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వచ్చిన ఫార్ ఢిల్లీకి రాకముందే అహ్మదాబాద్, గోవాల్లో పర్యటించారు. భారత పర్యటన సందర్భంగా అలదాబ్రా జాతికి చెందిన రెండు భారీ తాబేళ్లను సీషెల్స్ అధ్యక్షుడు కానుకగా ఇచ్చారు. వీటిని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉంచనున్నారు. ఫార్.. సోమవారం మోదీతో సమావేశం అనంతరం జరిగిన విందు సమావేశంలో సితార్ వాయించారు. ‘భారత్‌తో స్నేహబంధాన్ని సీషెల్స్ అధ్యక్షుడు ఫార్ వినూత్నంగా వ్యక్తపరిచారు. మోదీ ఏర్పాటుచేసిన విందులో సితార్ వాయిస్తూ.. పాట పాడారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొంటూ.. ఫార్ పాడిన పాటను ట్వీట్ చేశారు. ఆరోగ్యం జాగ్రత్త! రాష్ట్రపతి భవన్లో ఫార్ కోసం ఏర్పాటుచేసిన ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ కార్యక్రమంలో ఓ ఐఏఎఫ్ సైనికుడు వేసవి తాపం ధాటికి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు, సహచరులు ఆయన్ను పక్కన కూర్చోబెట్టి ప్రాథమిక చికిత్సనందించారు. అయితే, కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ.. ఆ సైనికుడి వద్దకెళ్లి పరామర్శించారు. కాసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. అసంప్షన్ కథేంటి? హిందూ మహాసముద్రంలోని సీషెల్స్‌లో పాగా వేయడం భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకం. 115 ద్వీపాల సమూహమైన సీషెల్స్‌తో ఒప్పందం కారణంగా ఈ ప్రాంతంలో భారత్ తన ప్రభావం పెంచుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఈ సముద్రంలోని వివిధ దేశాల్లో తన మిలటరీ అస్తిత్వాన్ని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అందుకే తన ప్రాభవాన్ని పెంచుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. 2015లోనే అసంప్షన్ ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. సీషెల్స్‌లో దీనిపై వ్యతిరేకత మొదలైంది. చైనా–భారత్‌ల మిలటరీ వ్యూహంలో చిక్కుకుపోతామనే భావన అక్కడి ప్రజల్లో వ్యక్తమైంది. కాగా, ‘మా తీరప్రాంత భద్రతను దృష్టిలో పెట్టుకుని అసంప్షన్ ద్వీపంపై చర్చించాం. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం’ అని ఫార్ అన్నారు. -
సీషెల్స్‌లో ఆర్మీ కేంద్రం ఏర్పాటుపై కదలిక
విక్టోరియా: పసిఫిక్ మహాసముద్రంలోని సీషెల్స్ దీవిలో మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదన పట్ల అక్కడి రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015లో సీషెల్స్‌లో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. కేంద్రానికి నిధులు భారత ప్రభుత్వమే సమకూరుస్తుందని.. రెండు దేశాలు వినియోగించుకోవచ్చని ప్రతిపాదించారు. తీరప్రాంత రక్షణ, అక్రమంగా చేపలు పట్టడం, మత్తుపదార్థాల రవాణా, పైరసీ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవటంలో ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
భారత్, షీషెల్స్ మధ్య కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ: గడిచిన మార్చి నెలలో షీషెల్స్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కుదుర్చకున్న అవగాహనమేరకు.. బుధవారం భారత్, షీషెల్స్ దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న షీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ అలిక్స్ మిఛెల్ బుధవారం మద్యాహ్నం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యాయి. అనంతరం ఐదు కీలక ఒప్పందాలపై ఇరుదేశాల అధికారులు సంతకం చేశారు. ఈ ఐదు ఒప్పందాల్లో పన్ను సమాచార మార్పిడి ఒప్పందంతోపాటు షీషెల్స్ కు డోర్నియార్ నిఘా విమానం అందజేత కీలకమైనవి. బ్లూ ఎకానమీ విషయంలో ఇరుదేశాల సహకారానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన, షీషెల్స్ లో వ్యవసాయ, విద్యారంగాల అభివృద్ధికి తోడ్పాటు తదితర ఇతర ఒప్పందాలపైనా ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాక మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా పాల్గొన్నారు. -
లంకతో చెట్టపట్టాలు
ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు బలపడాలన్న ధ్యేయంతో శ్రీలంక, సీషెల్స్, మారిషస్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన మూడు రోజుల పర్యటన ముగిసింది. హిందూ మహా సముద్ర ప్రాంత దేశాలైన ఈ మూడింటితో మంచి సంబంధాలుండటం ఆర్థికంగా మాత్రమే కాదు...వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి ఎంతో అవసరం. ఈ మూడు దేశాల్లోనూ భారత సంతతి జనాభా గణనీయంగా ఉన్నదని కూడా గుర్తుంచుకుంటే తాజా పర్యటనకున్న ప్రాముఖ్యత అవగతమవుతుంది. మన ప్రధాని ఒకరు శ్రీలంకలో పర్యటించడం 28 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారైతే...సీషెల్స్ పర్యటించడం 34 ఏళ్లలో ఇది తొలిసారి. ఇన్నేళ్లకుగానీ లంకనైనా, సీషెల్స్నైనా మన ప్రధాని సందర్శించడం సాధ్యంకాలేదంటే...అది చుట్టుపక్కల దేశాలతో సంబంధాల విషయంలో మనలో ఏర్పడిన నిర్లిప్తతను తెలియజేస్తుంది. మన వ్యూహాత్మక ప్రయోజనాలపై మనకున్న అవగాహనాలోపా న్ని వెల్లడిస్తుంది. మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి నిర్లిప్తత, అవగాహనాలోపం మన ప్రయోజనాలకూ, భద్రతకూ చేటు కలిగిస్తాయి. అలాగని హిందూ సముద్ర ప్రాంత దేశాలతో సదవగాహనకు మన దేశం పూర్తిగా తలుపులు మూసుకోలేదు. దాదాపు 20 సభ్య దేశాలున్న హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల సంఘం 1997లో ఏర్పడటంలో మన దేశం చొరవ ప్రధానంగా ఉంది. అయి తే, ఈ దేశాలతో మన స్నేహసంబంధాలు అవసరమైనంతగా విస్తరిం చలేదు. ప్రత్యేకించి శ్రీలంకతో అయితే అవి క్షీణ దశకు చేరుకున్నాయి. దీన్ని గుర్తిం చబట్టే తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించిన మోదీ... దానికి కొనసాగింపుగా ఆయా దేశాల్లో పర్యటించారు. వారిలో చాలామంది మన దేశం వచ్చారు. మిగిలిన రెండు దేశాల పర్యటన కన్నా మోదీ శ్రీలంకలో జరిపిన పర్యట నపై మన దేశంలోనే కాదు...ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఆసక్తిని ప్రదర్శిం చారు. ప్రధానంగా తమిళనాట దాదాపు అన్ని వర్గాలూ ఈ పర్యటననుంచి ఎంతో ఆశించాయి. సంస్కృతీ సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాల్లో భారత, శ్రీలంకల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. శతాబ్దాలుగా రెండు దేశాలమధ్యా సాన్నిహిత్యం ఉంది. అయినా, దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అపోహలు, అపార్థాలూ పెరి గాయి. లంకలో తమిళులపట్ల అక్కడి పాలకులు అనుసరిస్తున్న వైఖరి, లిబరేషన్ టైగర్ల పోరాటం వంటివి దీనికి కారణం. లంక తమిళులకూ, మన తమిళులకూ మధ్య ఉన్న సంబంధబాంధవ్యాల వల్ల అక్కడ సంభవించే పరిణామాల ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు ఉంటాయి. మహిం దా రాజపక్స అధ్యక్షుడుగా ఉన్న పదేళ్లకాలంలో మన సంబంధాలు ఏమాత్రం మెరుగ్గా లేవు. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ 2008లో సార్క్ శిఖరాగ్ర సదస్సు కోసం లంక వెళ్లారు. రెండేళ్లక్రితం కొలంబోలో జరిగిన కామన్వెల్త్ దేశాల సదస్సుకు తమిళ పార్టీల ఒత్తిడి కారణంగా ఆయన హాజరుకా లేదు. అటు రాజపక్స కూడా మన దేశం చాలాసార్లే వచ్చారు. అవన్నీ వ్యక్తిగత పర్యటనలే. ఏతావాతా రెండు దేశాలమధ్యా ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందలేదు. ఈ పరిస్థితిని చైనా పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకుంది. ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో అడుగుపెట్టి దాన్ని క్రమేపీ పటిష్టం చేసుకోవడం ప్రారంభించింది. పోర్టుల నిర్మాణంలో భారీ యెత్తున పెట్టుబడులు పెట్టడమేకాక...అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ చేయూతనిచ్చింది. శ్రీలంక విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరించింది. ఈ పరిణామాలు భారత్‌కు అసంతృప్తిని కలిగించడంతోపాటు అనుమానాలనూ పెం చాయి. హిందూసముద్ర ప్రాంతంలో భారత్‌ను చుట్టుముట్టాలన్న ధ్యేయం తోనే చైనా అడుగులేస్తున్నదని మన దేశం భావించింది. ఒకప్పుడు మనతో ఎంతో సన్ని హితంగా మెలిగిన లంక చైనాతో అంటకాగడం, మన భద్రతకు ముప్పు కలిగే చర్య లకు దోహదకారి కావడం మన దేశం జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా ఇటు సముద్ర మార్గాన్నీ, అటు రోడ్డు మార్గాన్నీ అనుసంధానించి ఆఫ్రికా, యూరప్‌లతో నేరుగా వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికీ, అదే సమయంలో ఆ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడానికీ చైనా రూపొందించిన విస్తృత వ్యూహం లోగుట్టు అర్థమయ్యాక మన దేశం జడత్వం వదిలించుకుంది. శ్రీలంకలో రాజపక్స పాలన ముగిసి మైత్రీపాల సిరిసేన ఏలుబడి వచ్చాక ఇరు దేశాలమధ్యా మైత్రి మళ్లీ చిగురిస్తున్నది. సిరిసేన తన తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకున్నారు. గత నెలలో మన దేశంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఇరు దేశాలమధ్యా పౌర అణు ఒప్పందం కుదిరింది. వ్యవసాయం, సాంస్కృతిక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందిం చుకోవడంపై ఇరు దేశాల అధినేతలూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు దానికి కొనసా గింపుగా పలు ఒప్పందాలపై సంతకాలయ్యాయి. మన దేశాన్ని సందర్శించే లంక పౌరులకు వెనువెంటనే వీసా మంజూరు, ప్రాంతీయ పెట్రో హబ్‌గా ట్రింకోమలి రూపొందడానికి తోడ్పడటం, లంక రైల్వేలకు 31 కోట్ల డాలర్ల సాయంవంటివి ఇందులో ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని చూసి ఎవరూ బెదిరిపో నవసరం లేదని మోదీ భరోసానిచ్చారు. పరస్పర నమ్మకం, విశ్వాసం ఏర్పడి తే...ఒకరి ప్రయోజనాలపట్ల మరొకరికి ఆదుర్దా ఉంటే ఈ ప్రాంత దేశాలు అన్ని విధాలా ఎదగగలవని చెప్పారు. అదే సమయంలో లంక తమిళుల సమస్య పరిష్కా రానికి కృషిచేయాలని, ముఖ్యంగా తమిళులకు స్వయంపాలన ఇవ్వడానికి వీలు కల్పిస్తున్న 13వ రాజ్యాంగ సవరణను త్రికరణ శుద్ధిగా అమలు చేయాలని హితవు పలికారు. ఈ పర్యటన రెండు దేశాలమధ్యా సాన్నిహిత్యానికి బాటలు పరచ డంతోపాటు అపార్థాలనూ, అపోహలనూ తొలగించడానికి ఉపయోగపడింది. రాగలకాలంలో ఇది సుదృఢమైన మైత్రికి దోహదం కాగలదని ఆశిద్దాం. -
విదేశీ పర్యటనకు ప్రధాని
సీషెల్స్, మారిషస్, శ్రీలంకల్లో పర్యటించనున్న మోదీ న్యూఢిల్లీ: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి బయల్దేరి సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. మారిషస్, శ్రీలంకల్లో కూడా ప్రధాని పర్యటించనున్నారు. హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం భారత్‌కు అతి కీలకమని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశ భద్రతకు, పురోగతికి ఇది ముఖ్యమన్నారు. పర్యటన ఆ మూడు దేశాలతో భారత్ సంబంధాలకు పునరుత్తేజం కలిగిస్తుందని, భారత విదేశాంగ విధాన ప్రాధాన్యాలేమిటో స్పష్టం చేస్తుందని పర్యటనకు బయల్దేరే ముందు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత 33 ఏళ్లలో సీషెల్స్‌లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీనే. సీషెల్స్, మారిషస్, శ్రీలంకల్లో ఆయన పర్యటన.. భారత్‌తో ఆ దేశాల స్థిర, చారిత్రక బంధాన్ని బలోపేతం చేస్తుందని, ఆర్థిక, సహకార, రక్షణ రంగంలో కొత్త అవకాశాలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో చైనా హిందూ మహాసముద్ర ప్రాంతంపై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో, ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ మిచెల్‌తో భేటీకి తాను ఎదురుచూస్తున్నానన్నారు. సీషెల్స్ నుంచి ప్రధాని మారిషస్ వెళతారు. గురువారం అక్కడ జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆ దేశ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్‌తో చర్చలు జరుపుతారు. 13, 14 తేదీల్లో శ్రీలంకలో పర్యటిస్తారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ప్రధాని వెంట ఉన్నారు.