విదేశీ పర్యటనకు ప్రధాని
సీషెల్స్, మారిషస్, శ్రీలంకల్లో పర్యటించనున్న మోదీ
న్యూఢిల్లీ: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి బయల్దేరి సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. మారిషస్, శ్రీలంకల్లో కూడా ప్రధాని పర్యటించనున్నారు. హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం భారత్‌కు అతి కీలకమని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశ భద్రతకు, పురోగతికి ఇది ముఖ్యమన్నారు. పర్యటన ఆ మూడు దేశాలతో భారత్ సంబంధాలకు పునరుత్తేజం కలిగిస్తుందని, భారత విదేశాంగ విధాన ప్రాధాన్యాలేమిటో స్పష్టం చేస్తుందని పర్యటనకు బయల్దేరే ముందు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత 33 ఏళ్లలో సీషెల్స్‌లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీనే.
సీషెల్స్, మారిషస్, శ్రీలంకల్లో ఆయన పర్యటన.. భారత్‌తో ఆ దేశాల స్థిర, చారిత్రక బంధాన్ని బలోపేతం చేస్తుందని, ఆర్థిక, సహకార, రక్షణ రంగంలో కొత్త అవకాశాలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో చైనా హిందూ మహాసముద్ర ప్రాంతంపై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో, ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ మిచెల్‌తో భేటీకి తాను ఎదురుచూస్తున్నానన్నారు. సీషెల్స్ నుంచి ప్రధాని మారిషస్ వెళతారు. గురువారం అక్కడ జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆ దేశ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్‌తో చర్చలు జరుపుతారు. 13, 14 తేదీల్లో శ్రీలంకలో పర్యటిస్తారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ప్రధాని వెంట ఉన్నారు.