ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు బలపడాలన్న ధ్యేయంతో శ్రీలంక, సీషెల్స్, మారిషస్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన మూడు రోజుల పర్యటన ముగిసింది. హిందూ మహా సముద్ర ప్రాంత దేశాలైన ఈ మూడింటితో మంచి సంబంధాలుండటం ఆర్థికంగా మాత్రమే కాదు...వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి ఎంతో అవసరం. ఈ మూడు దేశాల్లోనూ భారత సంతతి జనాభా గణనీయంగా ఉన్నదని కూడా గుర్తుంచుకుంటే తాజా పర్యటనకున్న ప్రాముఖ్యత అవగతమవుతుంది. మన ప్రధాని ఒకరు శ్రీలంకలో పర్యటించడం 28 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారైతే...సీషెల్స్ పర్యటించడం 34 ఏళ్లలో ఇది తొలిసారి.
ఇన్నేళ్లకుగానీ లంకనైనా, సీషెల్స్‌నైనా మన ప్రధాని సందర్శించడం సాధ్యంకాలేదంటే...అది చుట్టుపక్కల దేశాలతో సంబంధాల విషయంలో మనలో ఏర్పడిన నిర్లిప్తతను తెలియజేస్తుంది. మన వ్యూహాత్మక ప్రయోజనాలపై మనకున్న అవగాహనాలోపా న్ని వెల్లడిస్తుంది. మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి నిర్లిప్తత, అవగాహనాలోపం మన ప్రయోజనాలకూ, భద్రతకూ చేటు కలిగిస్తాయి. అలాగని హిందూ సముద్ర ప్రాంత దేశాలతో సదవగాహనకు మన దేశం పూర్తిగా తలుపులు మూసుకోలేదు. దాదాపు 20 సభ్య దేశాలున్న హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల సంఘం 1997లో ఏర్పడటంలో మన దేశం చొరవ ప్రధానంగా ఉంది. అయి తే, ఈ దేశాలతో మన స్నేహసంబంధాలు అవసరమైనంతగా విస్తరిం చలేదు. ప్రత్యేకించి శ్రీలంకతో అయితే అవి క్షీణ దశకు చేరుకున్నాయి. దీన్ని గుర్తిం చబట్టే తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించిన మోదీ... దానికి కొనసాగింపుగా ఆయా దేశాల్లో పర్యటించారు. వారిలో చాలామంది మన దేశం వచ్చారు. మిగిలిన రెండు దేశాల పర్యటన కన్నా మోదీ శ్రీలంకలో జరిపిన పర్యట నపై మన దేశంలోనే కాదు...ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఆసక్తిని ప్రదర్శిం చారు. ప్రధానంగా తమిళనాట దాదాపు అన్ని వర్గాలూ ఈ పర్యటననుంచి ఎంతో ఆశించాయి.
సంస్కృతీ సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాల్లో భారత, శ్రీలంకల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. శతాబ్దాలుగా రెండు దేశాలమధ్యా సాన్నిహిత్యం ఉంది. అయినా, దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అపోహలు, అపార్థాలూ పెరి గాయి. లంకలో తమిళులపట్ల అక్కడి పాలకులు అనుసరిస్తున్న వైఖరి, లిబరేషన్ టైగర్ల పోరాటం వంటివి దీనికి కారణం. లంక తమిళులకూ, మన తమిళులకూ మధ్య ఉన్న సంబంధబాంధవ్యాల వల్ల అక్కడ సంభవించే పరిణామాల ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు ఉంటాయి. మహిం దా రాజపక్స అధ్యక్షుడుగా ఉన్న పదేళ్లకాలంలో మన సంబంధాలు ఏమాత్రం మెరుగ్గా లేవు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ 2008లో సార్క్ శిఖరాగ్ర సదస్సు కోసం లంక వెళ్లారు. రెండేళ్లక్రితం కొలంబోలో జరిగిన కామన్వెల్త్ దేశాల సదస్సుకు తమిళ పార్టీల ఒత్తిడి కారణంగా ఆయన హాజరుకా లేదు. అటు రాజపక్స కూడా మన దేశం చాలాసార్లే వచ్చారు. అవన్నీ వ్యక్తిగత పర్యటనలే. ఏతావాతా రెండు దేశాలమధ్యా ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందలేదు.
ఈ పరిస్థితిని చైనా పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకుంది. ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో అడుగుపెట్టి దాన్ని క్రమేపీ పటిష్టం చేసుకోవడం ప్రారంభించింది. పోర్టుల నిర్మాణంలో భారీ యెత్తున పెట్టుబడులు పెట్టడమేకాక...అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ చేయూతనిచ్చింది. శ్రీలంక విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరించింది. ఈ పరిణామాలు భారత్‌కు అసంతృప్తిని కలిగించడంతోపాటు అనుమానాలనూ పెం చాయి. హిందూసముద్ర ప్రాంతంలో భారత్‌ను చుట్టుముట్టాలన్న ధ్యేయం తోనే చైనా అడుగులేస్తున్నదని మన దేశం భావించింది. ఒకప్పుడు మనతో ఎంతో సన్ని హితంగా మెలిగిన లంక చైనాతో అంటకాగడం, మన భద్రతకు ముప్పు కలిగే చర్య లకు దోహదకారి కావడం మన దేశం జీర్ణించుకోలేకపోయింది.
ముఖ్యంగా ఇటు సముద్ర మార్గాన్నీ, అటు రోడ్డు మార్గాన్నీ అనుసంధానించి ఆఫ్రికా, యూరప్‌లతో నేరుగా వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికీ, అదే సమయంలో ఆ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడానికీ చైనా రూపొందించిన విస్తృత వ్యూహం లోగుట్టు అర్థమయ్యాక మన దేశం జడత్వం వదిలించుకుంది. శ్రీలంకలో రాజపక్స పాలన ముగిసి మైత్రీపాల సిరిసేన ఏలుబడి వచ్చాక ఇరు దేశాలమధ్యా మైత్రి మళ్లీ చిగురిస్తున్నది. సిరిసేన తన తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకున్నారు. గత నెలలో మన దేశంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఇరు దేశాలమధ్యా పౌర అణు ఒప్పందం కుదిరింది. వ్యవసాయం, సాంస్కృతిక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెంపొందిం చుకోవడంపై ఇరు దేశాల అధినేతలూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు దానికి కొనసా గింపుగా పలు ఒప్పందాలపై సంతకాలయ్యాయి. మన దేశాన్ని సందర్శించే లంక పౌరులకు వెనువెంటనే వీసా మంజూరు, ప్రాంతీయ పెట్రో హబ్‌గా ట్రింకోమలి రూపొందడానికి తోడ్పడటం, లంక రైల్వేలకు 31 కోట్ల డాలర్ల సాయంవంటివి ఇందులో ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని చూసి ఎవరూ బెదిరిపో నవసరం లేదని మోదీ భరోసానిచ్చారు.
పరస్పర నమ్మకం, విశ్వాసం ఏర్పడి తే...ఒకరి ప్రయోజనాలపట్ల మరొకరికి ఆదుర్దా ఉంటే ఈ ప్రాంత దేశాలు అన్ని విధాలా ఎదగగలవని చెప్పారు. అదే సమయంలో లంక తమిళుల సమస్య పరిష్కా రానికి కృషిచేయాలని, ముఖ్యంగా తమిళులకు స్వయంపాలన ఇవ్వడానికి వీలు కల్పిస్తున్న 13వ రాజ్యాంగ సవరణను త్రికరణ శుద్ధిగా అమలు చేయాలని హితవు పలికారు. ఈ పర్యటన రెండు దేశాలమధ్యా సాన్నిహిత్యానికి బాటలు పరచ డంతోపాటు అపార్థాలనూ, అపోహలనూ తొలగించడానికి ఉపయోగపడింది. రాగలకాలంలో ఇది సుదృఢమైన మైత్రికి దోహదం కాగలదని ఆశిద్దాం.
లంకతో చెట్టపట్టాలు
Published Mon, Mar 16 2015 12:48 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement