వ్యాపార దార్శనికుడు
మనసున్న మారాజు
సహనశీలి.. మూగ జీవాల ప్రేమికుడు
ఎందరో వ్యాపారులకు గురువు
అవమానాలను సైతం తట్టుకుని నిలబడిన సృష్టికర్త
ప్రేమ విఫలమైనా కుంగిపోని ఉక్కు మనిషి
కంపెనీలో 66 శాతం దాతృత్వానికే కేటాయించిన మేరునగం
ధనవంతుల జాబితాలో పేరు లేకపోయినా మంచితనంలో అపరకుబేరుడు
ఒక శకం ముగిసింది. వ్యాపారం సామ్రాజ్యంలో అంచెంలంచెలుగా ఎదుగుతూ రూ.10 వేలకోట్ల వ్యాపారాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన దూరదృష్టి కలిగిన అజరామరుడు రతన్ టాటా ఇకలేరు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపించిన వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా చాలామంది తన ఆరోగ్యం గురించి పెద్ద సంఖ్యలో ఆరా తీశారు. వెంటనే సామాజిక మాధ్యమాల్లో స్పందించిన రతన్‌టాటా జనరల్ చెక్-ఆప్ కోసం ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. కాగా, బుధవారం రాత్రి ఆయన కన్నుముశారు.
దేశంలోనే అతి పెద్ద కంపెనీలుగా పేరున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ మూడు కలిపినా కూడా టాటా గ్రూప్ విలువతో సరితూగవు. అంత పెద్ద కంపెనీ అయినా ఏనాడూ ఆ సంస్థకు చెందిన ప్రముఖులు అత్యంత ధనవంతుల జాబితాలో లేరు. సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ గురించి, దాన్ని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం.
టాటా కంపెనీ మొదట ఒక టెక్స్‌టైల్ మిల్‌గా ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా ఈ గ్రూప్‌ను 1868లో ప్రారంభించారు. ఈ కంపెనీ తరతరాలుగా తమ వారసుల చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్‌లైన్స్ కంపెనీని ప్రారంభించింది టాటా సంస్థే. రెండో ప్రపంచ యుద్ధం తరువాత దాన్ని ఎయిరిండియా పేరుతో జాతీయం చేశారు. 2022లో ఎయిరిండియా సంస్థను టాటా తిరిగి దక్కించుకుంది. ఇదొక్కటే కాదు ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, దేశంలోనే మొదటగా తాజ్ హోటల్‌ను స్థాపించింది కూడా టాటా కంపెనీయే. ఇలా మన దేశానికి ఈ సంస్థ ఎన్నో కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది. దేశ నిర్మాణం, అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. టాటా గ్రూప్ సంస్థకు చాలా మంది సారథ్యం వహించినా రతన్ టాటాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఇదీ చదవండి: వ్యాపార దిగ్గజం 'రతన్ టాటా' అస్తమయం
రతన్ టాటా డిసెంబర్ 28, 1937లో అప్పటికే దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్‌డీ టాటా రతన్ టాటాను ఇండియాకు వచ్చి టాటా స్టీల్‌లో చేరమని సలహా ఇచ్చారు. దాంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి జంషెడ్‌పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
1991లో జేఆర్‌డీ టాటా రతన్ టాటాను టాటా గ్రూప్ ఛైర్మన్‌గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డు అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవంలేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్లందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. రూ.10 వేలకోట్లుగా ఉండే వ్యాపారాన్ని దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేర్చారు.
ఇంత పెద్ద కంపెనీకి సారథ్యం వహిస్తున్నప్పటికీ రతన్ టాటా ప్రపంచంలో, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో ఏనాడూ స్థానం సంపాదించలేదు. ఎందుకంటే టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో దాదాపు 66% శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలకే విరాళం ఇస్తున్నారు. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవ సంస్థలకు కాకుండా రతన్ టాటాకు చెందితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండేవారు.
బ్రిటిష్ వారికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి..
రతన్‌టాటా తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు..1998లో రతన్ టాటా, టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదట సంవత్సరం ఆశించినమేర విక్రయాలు జరగలేదు. దాంతో అందరూ టాటా ఇండికా విభాగాన్ని అమ్మేయాలని సలహా ఇచ్చారు. దాంతో ఫోర్డ్ కంపెనీని ఆశ్రయించారు. కార్ల తయారు చేయడం తెలయనప్పుడు ఎందుకు సాహసం చేయడమని అవమానించారు. క్రమంలో ఇండికాను లాభాలబాట పట్టించారు. యూరప్‌కు చెందిన కోరస్ స్టీల్ కంపెనీను కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్‌కు చెందిన టెట్లీ టీ కంపెనీను కొని ‘టాటా టీ’లో విలీనం చేశారు. దాంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టీ కంపెనీగా టాటా ఎదిగింది. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్‌లో కలుపుకుని టాటాను ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చారు రతన్ టాటా. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్లైతే భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వారికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.
పెళ్లికి దూరంగా టాటా..
రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్ప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
యువతంటే నమ్మకం..
రతన్ టాటాకు యువత, వారి వినూత్న ఆలోచనలు, శక్తిని అమితంగా నమ్మేవారు. అందుకే స్నాప్‌డీల్, పేటీఎం, కార్‌దేఖో, బ్లూస్టోన్, ఓలా, షావోమీ..వంటి దాదాపు 39కి పైగా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడపెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాల్లో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్‌గా స్థిరపడిపోయింది.
ప్రాణాలు కోల్పోయిన టాటా ఉద్యోగులు..
నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ సొంతం. తాజ్ హోటల్‌లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఏ ఉద్యోగి తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్‌లోని సుమారు 1500 మందికి పైగా అతిథులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏంతో మంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు. దీన్ని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో ప్రపంచానికి అర్థమైంది.
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు..
టాటా ట్రస్ట్..దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది. ఇప్పటికి మన దేశంతో పాటుగా విదేశాల్లో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్‌లు అందిస్తున్నారు. తాజ్ హోటల్‌లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన, చనిపోయిన కుటుంబాలకు రతన్‌టాటా ప్రత్యేకంగా సేవలందించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకు రూ.300 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్‌లో ఒక భవనానికి గౌరవంగా ‘టాటా హాల్’ అని పేరు పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషంట్ల కోసం ఏకంగా రూ.1000 కోట్లు దానం చేశారు. కుక్కులు వంటి మూగ జీవాలపై అమిత ప్రేమను చూపించేవారు.
ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరంచింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను వివిధ డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం గర్వించదగిన విషయం.
వీటన్నిటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నిలపడంలో 100 శాతం విజయాన్ని సాధించారు. డబ్బుపరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు. కానీ మంచితనంలో ఆయన అపరకుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరు ఇష్టపడే గౌరవించే బిజినెస్ మాన్‌గా రతన్ టాటా నిలిచిపోయారు. ఆయనకు ఇదే అశ్రునివాళి.
Comments
Please login to add a commentAdd a comment