
రతన్ అస్తమయంతో సర్వత్రా ఆసక్తి
నోయెల్ టాటాకు అవకాశం?
రేసులో మెహ్లీ మిస్త్రీ పేరు కూడా
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అస్తమించిన నేపథ్యంలో ఇక 365 బిలియన్ డాలర్ల టాటా మహాసామ్రాజ్యానికి వారసులెవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీటిలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మెహ్లీ మిస్త్రీ పేర్లు కూడా ఉన్నాయి.
వాస్తవానికి రతన్ టాటాకు తోడబుట్టిన సోదరుడైన జిమ్మీ టాటా పేరు కూడా పరిశీలించాల్సినప్పటికీ ఆయన వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, రతన్ టాటా తండ్రి నావల్ టాటా, మారుతల్లి సిమోన్ టాటా కుమారుడైన నోయెల్ పేరు ప్రముఖంగా తెరపైకి వచి్చంది. టాటా కుటుంబసభ్యుడు కావడంతో పాటు పలు గ్రూప్ కంపెనీలను నడిపించిన అనుభవం కూడా ఉండటమనేది నోయెల్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
ఆయన ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ సంస్థలకు చైర్మన్‌గా ఉన్నారు. అలాగే రతన్ టాటా ట్రస్టు బోర్డులో కూడా ఉన్నారు. టాటా సన్స్‌ను పర్యవేక్షించే టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా అయ్యేందుకు ఇది ఆయనకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రతన్ టాటా వివాహం చేసుకోకపోవడం, ఆయనకు సంతానం లేకపోవడంతో నోయెల్ సంతానానికి భవిష్యత్తులో టాటా గ్రూప్‌లో మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.
నోయెల్‌కు మాయా, నెవిల్, లియా... ఈ ముగ్గురు సంతానం ఉన్నారు. టాటా మెడికల్ సెంటర్‌కి మాయా ట్రస్టీగా వ్యవహరిస్తుండగా, హైపర్‌మార్కెట్ స్టార్ బజార్‌కి నెవిల్ సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. జుడియో బ్రాండ్ విస్తరించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. టాటా గ్రూప్‌లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీలో లియా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సన్నిహితుడు మెహ్లీ..: మెహర్‌జీ పల్లోంజీ గ్రూప్ డైరెక్టర్ అయిన మెహ్లీ మిస్త్రీ, రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు టాటా గ్రూప్‌తో చాలాకాలంగా అనుబంధం ఉంది. 2022లో కారు ప్రమాదంలో మరణించిన టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి మెహ్లీ కజిన్ అవుతారు. వాస్తవానికి టాటా సన్స్‌లో పల్లోంజీ మిస్త్రీ గ్రూప్‌నకు 18.4 శాతం వాటా ఉన్నందున ఆ గ్రూప్ అధినేత షాపూర్ మిస్త్రీ పేరు కూడా పరిశీలనకు రావాలి. కానీ టాటాలతో మిస్త్రీలకు విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఆయనకు టాటా సామ్రాజ్యం బాధ్యతలు లభించకపోవచ్చనే అభిప్రాయం నెలకొంది. నోయెల్, మెహ్లీతో పాటు గ్రూప్‌లో ఉన్నవారే కాకుండా బైటి వ్యక్తుల పేర్లు కూడా అకస్మాత్తుగా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment