Realty Growth In Hyderabad After Telangana Formation - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే?

Published Sat, Jun 11 2022 3:43 PM | Last Updated on Sun, Jun 12 2022 4:53 AM

Realty Growth In Hyderabad After Telangana Formation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పట్టణాభివృద్ధి సంస్థలు, మిషన్‌ భగీరథ, కాకతీయ వంటి వాటితో జిల్లా కేంద్రాలలో అభివృద్ధి మొదలైంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఏర్పాటుతో పాటు కరెంట్‌ కోతలను తగ్గించడం, మౌలిక వసతుల కల్పన, కొత్త రోడ్లు, అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లతో నగరంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం వినూత్న ప్రభుత్వ పథకాలు, విధాన పరమైన నిర్ణయాలతో ఐటీ, పరిశ్రమలు, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయి. మౌలిక వసతులను మెరుగుపరచడం, శాంతిభద్రతలకు పెద్ద పీట వేయడంతో దేశ, విదేశీ సంస్థలు నగరానికి వస్తున్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీల ఎగుమతులు పెరిగాయి. ఇలా పలు అంశాల కారణంగా స్థిరాస్తి రంగానికి ఊపొచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో 2014లో ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడెంత చెబుతున్నారో చూద్దాం! 

- తెలంగాణ ఆవిర్భావం నాటికి అమీర్‌పేటలో అపార్ట్‌మెంట్‌ రేటు చ.అ.కు రూ.3,400 నుంచి రూ.4 వేలుగా ఉండేది. భూమి ధర గజానికి రూ.30 వేల నుంచి రూ.45 వేలుగా ఉండేది. ఆ తర్వాత అమీర్‌పేట రూపురేఖలు మారిపోయాయి. వాణిజ్య ప్రాంతంగా స్థిరపడింది. దీంతో ఇక్కడ గజం ధర లక్షకు పైగానే చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ కొత్త అపార్ట్‌మెంట్లు కట్టేందుకు ఖాళీ స్థలాలు అందుబాటులో లేవు. కొంత మేర స్థలం దొరికినా.. అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తే హాట్‌కేకులా అమ్ముడవుతున్నాయి. సనత్‌నగర్‌లో చ.అ.కు రూ.3,400 నుంచి 4,400 ఉన్న రేటు ప్రస్తుతం రూ.7  నుంచి 9 వేలు చెబుతున్నారు.  

- జూబ్లీ్లహిల్స్, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల్లో గిరాకీ ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది. ఆరంభంలో ఇక్కడ చిన్న అపార్ట్‌మెంట్లలో చ.అ.కు రూ.5,500లకు అమ్మేవారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లో రేటు ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కొన్ని ఏరియాలల్లో గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణం జరిగింది. వాటి చ.అ.కు రూ. 8,500 నుంచి 10 వేలుగా ఉండేది. ఫ్లాట్ల విస్తీర్ణం ఎక్కువే ఉండేది కాబట్టి లగ్జరీ కొనుగోలుదారులే కస్టమర్లుగా ఉండేవాళ్లు. ఇప్పుడైతే పెరిగిన భూమి ధరల ప్రకారం.. ఇక్కడ చ.అ.కు రూ.12 వేల నుంచి చెబుతున్నారు. కాస్త ఖరీదైన గేటెడ్‌ కమ్యూనిటీలైతే చ.అ.కు రూ.15 వేల నుంచి విక్రయిస్తున్నారు. ఇక్కడి ఫ్లాట్లు పెద్దగా మార్కెటింగ్‌ లేకుండానే అమ్ముడవుతాయి. ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు వంటివారు ఈ ప్రాంతాలలో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ కొనలేని వారు రాయదుర్గం, నానక్‌రాంగూడ, పుప్పాల్‌గూడ, కోకాపేట, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి ప్రాంతాలలో కొనుగోలు చేస్తుంటారు. ఈ ప్రాంతాలలో చాలా మందికి ఇన్వెస్ట్‌మెంట్‌ కోణంలో కొనుగోలు చేస్తుంటారు. 

- 2014 వరకు మోతీనగర్‌ మధ్యతరగతి ప్రజలకు చిరునామాగా ఉండేది. సుమారు రూ.30 లక్షలు పెడితే ఫ్లాట్లు లభించేవి. ఆ తర్వాత ధర రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది. ప్రస్తుతం ఇక్కడ రూ.70–90 లక్షలు పెడితే కానీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ దొరకని పరిస్థితి. కొత్త అపార్ట్‌మెంట్లు పెద్దగా అందుబాటులో లేవు. దీంతో చాలా మంది మధ్యతరగతి ఈ ప్రాంతాలలో సెకండ్‌ హ్యాండ్‌ ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. 

- కేపీహెచ్‌బీ కాలనీలో 2014లో రూ.40 లక్షలు పెడితే స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ దొరికేది. ఆ తర్వాత ఇది రూ.50 లక్షలకు చేరింది. 2017 తర్వాత ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలు, ఇక్కడి మౌలిక వసతుల అభివృద్ధి, ఐటీ కారిడార్‌లో కొత్త కంపెనీలు తదితర కారణాల వల్ల ఒక్కసారిగా ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దాని ప్రభావం అపార్ట్‌మెంట్ల మీద పడింది. ప్రస్తుతం కేపీహెచ్‌బీలో రూ.కోటి పెట్టనిదే 2 బీహెచ్‌కే ఫ్లాట్లు దొరకని పరిస్థితి.  

- ఒకప్పుడు మియాపూర్, మదీనాగూడ, చందానగర్‌ వంటి ప్రాంతాలు మధ్యతరగతికి చిరునామాగా ఉండేది. మియాపూర్‌ మెట్రో ఆరంభమయ్యాక ఇక్కడి భూముల ధరలలో కదలికలు వచ్చాయి. 2014లో చ.అ.కు రూ.2,200లుగా ఉండేవి. అలాంటిది ప్రస్తుతం ఇక్కడ చ.అ.కు రూ.6 వేలు పెట్టనిదే స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు లభించవు. ఇక గేటెడ్‌ కమ్యూనిటీలు, హైరైజ్‌ అపార్ట్‌మెంట్లలో చ.అ.కు ఎంతలేదన్నా రూ.7 వేల వరకు పెట్టాల్సిందే. ఎనిమిదేళ్లలో సుమారు 150–200 శాతం రేటు పెరిగింది. 
 
- ప్రగతి నగర్‌ చిన్న అపార్ట్‌మెంట్లకు చిరునామా. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లే కనిపిస్తాయి. కొందరు బిల్డర్లు 200 గజాల ప్లాట్లను పక్కపక్కన పెట్టేసి 400 గజాలల్లో అపార్ట్‌మెంట్లను నిర్మించారు. అనుమతికి దరఖాస్తు చేసుకునేటప్పుడు రెండు వేర్వేరుగా చూపెట్టి.. ఆ తర్వాత వాటిని కలిపి కట్టేసేవారు. ఈ పద్దతి ఎక్కువగా ప్రగతినగర్, నిజాంపేట వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. నిన్నటివరకు కోర్ట్‌ వివాదాలలో ఉన్న భూములకు మోక్షం లభించడంతో పలు బడా కంపెనీల కమ్యూనిటీలు ఆరంభమయ్యాయి. అలాంటి వాటిల్లో ధర ఎక్కువగానే ఉంది. 2014లో ఇక్కడ చ.అ. రూ.2 వేలుగా ఉండేవి. ప్రస్తుతం రూ.6 వేల నుంచి చెబుతున్నారు.  

- బాచుపల్లిలో ఇటీవల కాలంలో గేటెడ్‌ కమ్యూనిటీల సంఖ్య పెరిగింది. ఇకవైపు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చేరువగా ఉండటం, మరోవైపు మియాపూర్, జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్లు వంటివి సమీపంలో ఉండటం, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో ఇటీవల కాలంలో ఈ ప్రాంతంపై బడా డెవలపర్ల దృష్టి పడింది. 2014లో ఈ ప్రాంతంలో ధర చ.అ.కు రూ.2 వేలుగా ఉండేది. కానీ, ఇప్పుడు రూ.5 వేల నుంచి చెబుతున్నారు.  

- మెట్రో స్టేషన్, జిల్లాలకు ఎంట్రీ పాయింట్‌గా ఉండటం ఎల్బీనగర్, ఉప్పల్‌ ప్రాంతాలకు కలిసొచ్చే అంశాలు. శివారు ప్రాంతాలలో కాకుండా కాలనీల్లో ఎక్కువగా అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఫ్లాట్‌ కొనాలంటే రూ.60 లక్షల వరకు ఉండాల్సిందే. బండ్లగూడ, కిస్మత్‌పూర్, పీరంచెరువులలో గేటెడ్‌ కమ్యూనిటీలు కట్టే డెవలపర్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ రూ.70 లక్షలు ఉంటే తప్ప 2 బీహెచ్‌కే కొనలేం.  (గమనిక: ఈ రేట్లు కేవలం అవగాహన కోసమే. అపార్ట్‌మెంట్‌ ఉన్న ప్రాంతం, వసతులను బట్టి ధరలలో హెచ్చుతగ్గులుంటాయి) 

చదవండి: వారెవ్వా హైదరాబాద్‌.. 31 వేల రిజిస్ట్రేషన్లు.. రూ.15 వేల కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement