
రాహుల్ శర్మ నేతృత్వంలోని భారతీయ రివోల్ట్ మోటార్స్ సంస్థ 2019లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బైక్ లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి వీటి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. తాజాగా రెండు రోజుల క్రితం రివోల్ట్ ఆర్వీ400 బైక్ లను సేల్ తీసుకొచ్చిన రెండు గంటల్లోనే బుకింగ్ క్లోజ్ అయినట్లు ప్రకటించింది. రివోల్ట్ మోటార్స్ రెండు గంటల వ్యవధిలోనే రూ.50 కోట్లకు పైగా విలువైన మోటారు సైకిళ్లను విక్రయించింది. ఇప్పుడు బైక్ లను బుక్ చేసుకున్న కస్టమర్ లకు సెప్టెంబర్ 2021 నుంచి డెలివరీ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది.
ఫేమ్ 2 కింద సబ్సిడీలు లభించడంతో ఆర్వీ 400 బైక్ ధరను రివోల్ట్ రూ.28,201 మేర తగ్గించింది. రూ.1,19,000 ధరకే బుకింగ్కు పెట్టింది. ఈ బైక్లకు డిమాండ్ విపరీతంగా పెరిగేందుకు ఇది ఒక కారణం. ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు చాలా తక్కువగా ఉన్న సమయంలో ఆర్వీ 400 వచ్చింది. వాస్తవానికి, మార్కెట్లో దీనికి పోటీగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు ఇప్పటికీ లేవు. దీని బైక్ డిజైన్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు గతంలో కొన్న వారి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ లభించడంతో సేల్స్ పుంజుకున్నాయి. రివోల్ట్ మోటార్స్ బైక్ కొనేవారికి ఈఎమ్ఐ కూడా సులభంగా లభిస్తుంది. డౌన్ పేమెంట్, రిజర్వేషన్ ఫీజులు వంటివి లేవు. భవిష్యత్ లో డిమాండ్ అనుగుణంగా మరిన్ని ఉత్పత్తులను తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది. 72వీ 3.24 కిలోవాట్స్ లిథియన్ ఇయాన్ బ్యాటరీతో గల 3కిలోవాట్ మోటార్తో ఆర్వీ 400 మోడల్ వస్తోంది. ఈ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇకో, నార్మల్, స్పోర్ట్స్ లాంటి మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment