సాక్షి,ముంబై: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకపక్క భారీ పెట్టుబడులు, మరోపక్క భారీ విస్తరణ వ్యూహాలతో దూసుకుపోతోంది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ప్రత్యర్థులకు ధీటుగా అవతరించింది. ఇప్పుడిక రీటైల్ విభాగంలో భారీ పెట్టుబడులతో రిటైల్ రంగంలో గుత్తాధిపత్యం దిశగా అడుగులు వేస్తున్న రిలయన్స్ తాజాగా మరో కంపెనీని చేజిక్కించు కునేందుకు చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా సౌతిండియాలో పాగా వేసేందుకు బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పంద విలువ రూ.3 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
రిలయన్స్ డిజిటల్ పేరుతో దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దక్షణాది రాష్ట్రాల్లో హోం అప్లయన్సస్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వాటా మెరుగ్గా ఉంది. కస్టమర్లు భారీగా ఉన్నాయి. బ్రాండ్ వాల్యూ కూడా ఉంది. ఇప్పటికే బిగ్ బజార్ సహా అనేక రిటైల్ బ్రాండ్లతో వ్యాపారం చేస్తున్న ఫ్యూచర్ గ్రూపును సొంతం చేసుకుంది. కాగా 1980లో పవన్ కుమార్ బజాజ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో షోరూంలను ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థకు దక్షిణాది రాష్ట్రాల్లో 60 స్టోర్లలో 1,200 మంది సిబ్బంది పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment