సాక్షి, ముంబై: అమెరికా డాలరు మారకంలో రోజురోజుకు దిగజారుతున్న దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై రాయిటర్స్ పోల్ కీలక విషయాలను వెల్లడించింది. రూపాయి మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సంవత్సరాంతానికి డాలర్‌తో రూపాయి 84.50 స్థాయికి పడిపోతుందన్న అంచనాలు ఆందోళనకు దారి తీసింది.
దేశీయ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అమెరికా ఫెడ్ వడ్డీరేటు కారణంగా అమెరికా డాలరు మారకంలో రూపాయి ఈ ఏడాది తొమ్మిదేళ్లలో లేనంత కనిష్టానికి పడిపోతుందని రాయిటర్స్ పోల్స్ తేల్చి చెప్పింది. 14 మంది బ్యాంకర్లు, విదేశీ మారకద్రవ్య సలహాదారుల పోల్ అంచనాల ప్రకారం, డిసెంబర్ నాటికి మన రూపాయి 84.50కి మరింత పడిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సంవత్సరం రూపాయి కోలుకోదనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు యూఎస్ ఫెడ్ వడ్డింపుతో డాలరు ఇండెక్స్ 18శాతం జంప్ చేసింది.
రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలహీనత పడి అతి త్వరలోనే 84 స్థాయిని తాకనుందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ కమోడిటీస్ రాహుల్ కలంత్రి అన్నారు. డిసెంబరు నాటికి రూపాయి డాలర్‌తో పోలిస్తే 85 స్థాయికి పతకం కావచ్చు, ఎందుకంటే బాహ్య వాతావరణంలో పెద్ద మార్పులు కనిపించడం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ అభిప్రాయపడ్డారు.
కాగా బుధవారం తొలిసారి 83 స్థాయిని పతనమైన రూపాయి83.21 వద్ద గురువారం మరో ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 12శాతం పడిపోయింది. 2021లో సగటున 15.3 బిలియన్ల డాలర్లతో పోలిస్తే, ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల భారతదేశం సగటు నెలవారీ వాణిజ్య లోటు 23.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది రూపాయి విలువపై ప్రభావాన్ని చూపుతోంది. అటు ఎన్‌ఎస్‌డిఎల్ డేటా ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయ ఈక్విటీల నుండి 23.4 బిలియన్ డాలర్లు, డెట్ మార్కెట్‌నుంచి 1.4 బిలియన్ డాలర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment