న్యూయార్క్ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో అనివార్యంగా మారిన వర్క్ ఫ్రం హోం (ఇంటి నుంచి పని)తో మైక్రోసాఫ్ట్ భారీగా లాభపడినా టెక్ దిగ్గజం సీఈవో సత్య నాదెళ్ల మాత్రం ఈ పద్ధతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోంతో లాభాలున్నా ఇది సంక్లిష్టతలతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్ మీటింగ్‌లతో ఉద్యోగులు అలసిపోతారని, పని వాతావరణం నుంచి ప్రైవేట్ జీవితానికి మారడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. వాల్‌స్ర్టీట్ జర్నల్ సీఈఓ కౌన్సిల్ భేటీలో ఆయన మాట్లాడుతూ మీరు ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో మీరు పనిచేస్తూ నిద్రిస్తున్నట్టు ఉంటుందని వ్యాఖ్యానించారు. వీడియో సమావేశాలు ఉత్సాహపూరితంగా ఉన్నా 'ఉదయాన్నే మీ మొదటి వీడియో సమావేశానికి ముప్పై నిమిషాల పాటు వీడియోలో ఏకాగ్రతతో వ్యవహరించడం కీలకం కావడంతో ఆపై అలిసిపోయే అవకాశం ఉంద’ని అన్నారు.
దూరం నుంచి పనిచేయడం వల్ల కార్యాలయంలో ఉండే ప్రయోజనాలను కోల్పోతామని చెప్పుకొచ్చారు. వీడియో సమావేశాలు లాంఛనంగా మారాయని, సమావేశాల ముందు, తర్వాత పనులు చక్కబెట్టాల్సి వస్తుందని చెప్పారు. పని, వ్యక్తిగత కార్యకలాపాల మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలనేది మహమ్మారి తనకు బోధించిందని చెప్పారు. తన షెడ్యూల్‌పై తాను ఎక్కువగా దృష్టిసారించానని తెలిపారు. దూరం నుంచి పనిచేస్తూ కొత్తగా విధుల్లో చేరినవారిని మీరు సంస్థలోకి ఆహ్వానించాలని, శిక్షణ, నైపుణ్య సముపార్జన, నైపుణ్యాలను తాజాపర్చడం కీలక అంశాలుగా ముందుకొచ్చాయని చెప్పారు. కాగా, వర్క్ ఫ్రం హోం పద్ధతి విశ్వవ్యాప్తంగా తప్పనిసరి కావడంతో క్లౌడ్ సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ నెలకొంది.
ఇంటర్‌నెట్ భద్రతపై సోషల్ మీడియా ఫోకస్
ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్ భద్రతపై దృష్టిసారించాలని సత్య నాదెళ్ల ఇదే సమావేశంలో పిలుపు ఇచ్చారు. ఇంటర్‌నెట్ భద్రతకు పెద్దపీట వేస్తూ సోషల్ మీడియాలో కీలక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ తన ఎక్స్‌బాక్స్ గేమింగ్ వేదిక ద్వారా కంటెంట్ సంబంధిత అంశాలను పరిష్కరించడంలో అనుభవం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. చదవండి : నాన్నా.. నువ్వే నా దిక్సూచి: నాదెళ్ల
Comments
Please login to add a commentAdd a comment