భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మాధవి పూరి బచ్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఆమె రాజీనామాను డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది ఉద్యోగులు సెబీ ముంబై ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
సెబీలో విధి నిర్వహణ పరిస్థితులపై ఉద్యోగులు ఆర్థిక శాఖకు చేసిన ఫిర్యాదుపై సెబీ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే ఉద్యోగులు నిరసనకు దిగారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. నిరసన దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. నిరసన తర్వాత ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వెళ్లారు.
తమ ఫిర్యాదుపై ఉన్నతస్థాయి అధికారులు చేస్తున్న వక్రీకరణకు వ్యతిరేకంగా, తమ ఐక్యతను ప్రదర్శించడమే ఈ నిరసన ఉద్దేశం అని ఉద్యోగుల మధ్య అంతర్గత సందేశాన్ని ఉటంకిస్తూ మనీకంట్రోల్ పేర్కొంది. సెబీ ఉద్యోగులపై అసత్యాలు ప్రచారం చేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవడం, సెబీ చైర్‌పర్సన్ రాజీనామా చేయడం తక్షణ డిమాండ్ అని ఆ సందేశంలో ఉన్నట్లు తెలిపింది.
నిరసన ఎందుకంటే..
సెబీలో పని చేయడం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని, ఇక్కడ విషపూరితమైన పని వాతావరణం ఉందంటూ కొంతమంది సెబీ ఉద్యోగులు గత నెలలో ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీన్ని సెబీ తప్పుబట్టింది. పనితీరు, జవాబుదారీతనంలో ప్రమాణాలను పాటించే విషయంలో ఉద్యోగులను బయటి శక్తులు తప్పుదోవ పట్టించాయంటూ సెబీ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment