న్యూఢిల్లీ: ఇటీవల స్టాక్ మార్కెట్లు కొంతమేర ఒడిదుడుకులు చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్ మాత్రం ఉత్సాహంతో కదం తొక్కుతోంది. తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. డేటా అనలిటిక్స్, ఇన్‌సైట్స్ సేవల కంపెనీ కోర్స్5 ఇంటెలిజెన్స్ తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వివరాలు చూద్దాం..
ఫైవ్‌స్టార్ బిజినెస్ ఫైనాన్స్
ఎన్‌బీఎఫ్‌సీ.. ఫైవ్‌స్టార్ బిజినెస్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా సెబీ నుంచి అనుమతిని పొందింది. టీపీజీ, మ్యాట్రిక్స్ పార్టనర్స్, నార్వెస్ట్ వెంచర్స్, సీక్వోయా, కేకేఆర్‌లకు పెట్టుబడులుగల కంపెనీ సెప్టెంబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,752 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఐపీవోలో భాగంగా ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా టీపీజీ ఏషియా 7 ఎస్‌ఎఫ్ పీటీఈ రూ. 1,350 కోట్లు, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ రూ. 569 కోట్లు, నార్వెస్ట్ వెంచర్ పార్టనర్స్ మారిషస్ రూ. 386 కోట్లు ఎస్‌సీఐ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 257 కోట్లు, ప్రమోటర్ గ్రూప్ రూ. 181 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్, సొంత ఆదాయం కలిగిన వ్యక్తులకు సెక్యూర్డ్ బిజినెస్ రుణాలను కంపెనీ అందిస్తుంటుంది.
వారీ ఎనర్జీస్...
సౌర ఇంధన రంగ కంపెనీ.. వారీ ఎనర్జీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా సెబీ నుంచి అనుమతిని పొందింది. కంపెనీ నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 40 లక్షలకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తాజా ఈక్విటీ నిధుల్లో రూ. 1,162 కోట్లను 2 గిగావాట్ల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ సెల్ తయారీ యూనిట్‌తోపాటు, 1 జీడబ్ల్యూ వార్షిక సామర్థ్యంతో గుజరాత్‌లోని చిక్లీలో నెలకొల్పనున్న సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్‌కు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఇప్పటికే సూరత్, టంబ్, నందిగ్రామ్‌లలో తయారీ యూనిట్లను కలిగి ఉంది.
ఐపీవోకు కోర్స్5 ఇంటెలిజెన్స్
డేటా అనలిటిక్స్, ఇన్‌సైట్స్ సేవల కంపెనీ కోర్స్5 ఇంటెలిజెన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది.
2 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
Published Tue, Jan 11 2022 8:23 AM | Last Updated on Tue, Jan 11 2022 8:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment