ముంబై: ఫ్రంట్ రన్నింగ్ కేసులను తీవ్రంగా పరిగణిస్తున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా క్వాంట్ మ్యుచువల్ ఫండ్‌పై దృష్టి సారించింది. కంపెనీకి చెందిన హైదరాబాద్, ముంబై కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధమున్న డీలర్లు, వ్యక్తులను కూడా సెబీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సందీప్ టాండన్ నెలకొల్పిన క్వాంట్ మ్యుచువల్ ఫండ్ అసెట్లు 2019లో సుమారు రూ. 100 కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం రూ. 90,000 కోట్ల పైచిలుకు చేరాయి. 26 స్కీములు, 54 లక్షల ఫోలియోలతో ఈ ఫండ్ ఈ ఏడాది జనవరిలోనే రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. సంస్థకి చెందిన స్మాల్ క్యాప్ ఫండ్ గత అయిదేళ్లలో ఏకంగా 45 శాతం రాబడిని అందించింది. మే నెలలో స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి వచి్చన మొత్తం నిధులలో 43 శాతం నిధులు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లోకే రావడం గమనార్హం.
పెద్ద ఆర్డర్లు రాబోతున్న సమాచారం తెలుసుకుని ఫండ్ మేనేజర్లు, డీలర్లు, బ్రోకర్లు ముందుగానే తమ సొంత ఖాతాల ద్వారా ఆయా షేర్లలో ట్రేడింగ్ చేసి లాభపడటాన్ని ఫ్రంట్ రన్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి లావాదేవీలన్నీ వేరే వారి పేరిట ఉండే ఖాతాల ద్వారా జరుగుతాయి కాబట్టి అంతిమంగా లబ్ధి పొందే వ్యక్తులను గుర్తించడం కఠినతరంగా ఉంటోంది. దీంతో సెబీ కొన్నాళ్లుగా ఈ తరహా కేసులపై మరింత లోతుగా విచారణ జరుపుతోంది. ఇలాంటి ఆరోపణలపైనే యాక్సిస్ మ్యుచువల్ ఫండ్‌కి చెందిన ఫండ్ మేనేజర్ వీరేశ్ జోషితో పాటు అతనికి సంబంధించిన 20 సంస్థలు, వ్యక్తులపై సెబీ గతంలో చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment