ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒకే థీమ్ కింద అనేక స్కీములను ప్రవేశపెడుతుండటానికి చెక్ పెడుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. ఇకపై మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో కేవలం అయిదే రకాలు ఉండాలని నిర్దేశించింది. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది.
దీని ప్రకారం ఇకపై స్కీములన్నింటినీ కూడా ఈక్విటీ, డెట్, హైబ్రీడ్, సొల్యూషన్ ఓరియంటెడ్, అదర్ స్కీమ్ అనే అయిదు కేటగిరీల్లోనే వర్గీకరించాల్సి ఉంటుంది. ఒక కేటగిరీ నుంచి ఒకటే స్కీముకు అనుమతి ఉంటుంది.అయితే, ఇండెక్స్ ఫండ్స్, వివిధ సూచీల ఆధారంగా పనిచేసే ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), రకరకాల స్కీమ్‌ల ఆధారంగా ఉండే ఫండ్ ఆఫ్ ఫండ్స్, వివిధ థీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసే సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్స్‌కి దీన్నుంచి మినహాయింపు ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం తాము అమలు చేస్తున్న స్కీములను కొత్త కేటగిరీలకు అనుగుణంగా విశ్లేషించుకుని, తదనుగుణంగా రెండు నెలల్లోగా సెబీకి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులేమైనా ఉంటే గరిష్టంగా మూడు నెలల్లోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వాటితో పాటు ఇంకా రాబోయే ఓపెన్ ఎండెడ్ స్కీములన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఫండ్ ప్రవేశపెట్టే వివిధ స్కీములన్నింట్లోనూ అసెట్ కేటాయింపులు, ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల్లో భిన్నత్వం స్పష్టంగా ఉండాలని సెబీ సూచించింది. ఒకే రకమైన థీమ్‌తో వివిధ సంస్థలు అందించే స్కీముల స్వభావం కూడా ఏకరూపంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనివల్ల వాటిని పోల్చి చూసుకుని, ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చనే దానిపై ఇన్వెస్టరు సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని తెలిపింది. మరోవైపు, లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ నిర్వచనాన్ని కూడా సెబీ ప్రత్యేకంగా పేర్కొంది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 100 కంపెనీలు లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కింద, 101–250 దాకా సంస్థలు మిడ్ క్యాప్ కోవకి, 251వ సంస్థ నుంచి మిగతావి స్మాల్‌క్యాప్ కోవకి చెందుతాయని తెలిపింది. సెబీ నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ ఎండీ ఆశీష్ సోమయ్య తెలిపారు. అసంఖ్యాకంగా ఒకే రకమైన స్కీములు గుప్పించడం కాకుండా పథకాలు కొన్నే అయినా మెరుగైనవి అందించడానికి వీలవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment