
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగంపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిమితులు విధించింది. ఇందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసింది. వెరసి గత నెలలో బోర్డు ప్రతిపాదించిన పలు సవరణలు, నిబంధనల అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. తద్వారా ఐపీవో నిబంధనలను కఠినతరం చేసింది.
ఆంక్షలు ఇలా
తాజా నోటిఫికేషన్ ప్రకారం అప్పటికి గుర్తించని భవిష్యత్ కొనుగోళ్లకు వెచ్చించే నిధులపై పరిమితులు విధించింది. ఇదే విధంగా ప్రధాన వాటాదారులకు షేర్ల జారీపైనా ఆంక్షలకు తెరతీసింది. యాంకర్ ఇన్వెస్టర్ల లాకిన్ గడువును 90 రోజులకు పొడిగించింది. ఇకనుంచీ సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించే నిధులను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు పర్యవేక్షించనున్నాయి. సంపన్న వర్గాల(ఎన్‌ఐఐలు)కు కేటాయించే ఈక్విటీ నిబంధనలపైనా దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా పలు ఐసీడీఆర్ నిబంధనలను సవరించింది. ఇటీవల ఆధునిక టెక్నాలజీ ఆధారిత కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే.
35 శాతమే..
తాజా నిబంధనల ప్రకారం భవిష్యత్‌లో ఇతర కంపెనీల(అప్పటికి గుర్తించని) కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం మొత్తం ఐపీవో నిధుల్లో 35 శాతానికే అనుమతి ఉంటుంది. ఇలాకాకుండా భవిష్యత్ కొనుగోళ్లకు చెందిన ఇతర కంపెనీలు, తదిర వివరాలను ఆఫర్ డాక్యుమెంట్‌లో పొందుపరిస్తే ఈ పరిమితులు వర్తించవు. ఏదైనా కంపెనీలో 20 శాతానికి మించి వాటా కలిగిన వాటాదారుడు ఐపీవోలో 50 శాతం వరకూ తమ వాటాను ఆఫర్ చేసేందుకు అనుమతిస్తారు. 20 శాతంకంటే తక్కువ వాటాగల వాటాదారులు 10 శాతం వాటాను మాత్రమే విక్రయించేందుకు వీలుంటుంది. ఇక యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసే ఈక్విటీలో 50 శాతం వాటాను ప్రస్తుత 30 రోజుల తదుపరి విక్రయించేందుకు అవకాశముంటుంది. మిగిలిన 50 శాతాన్ని 90 రోజుల తదుపరి మాత్రమే అమ్ముకునేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు అమలుకానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment