ముంబై: జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు బుధవారం ఆరంభ లాభాల్ని కోల్పోయి మిశ్రమంగా ముగిశాయి. అలాగే డెరివేటివ్స్ కాంట్రాక్టులకు ముగింపునకు ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహించడం ప్రతికూలంగా మారింది. ఇంట్రాడేలో 239 పాయింట్లు పెరిగి 56,198 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 15 పాయింట్ల నష్టంతో 55,944 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 87 పాయింట్లు ఎగసి 16,712 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి పది పాయింట్ల స్వల్ప లాభంతో 16,635 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ఈ ముగింపు స్థాయిలు కొత్త గరిష్టాలు కావడం విశేషం. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి.
ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 298 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్ల పరిధిలో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1072 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.151 కోట్ల షేర్లను అమ్మారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఐదు పైసలు క్షీణించి 74.24 వద్ద స్థిరపడింది. కోవిడ్ వ్యాక్సిన్ అనుమతులు లభించడంతో పాటు జాక్సన్ హోల్ వార్షిక సమావేశం యూఎస్ ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లపై సానుకూల వ్యాఖ్యలు చేయవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.
టీసీఎస్ @ రూ.13.50 లక్షల కోట్లు
ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీ మార్కెట్ విలువ బుధవారం రూ.13.50 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ టీసీఎస్‌యే. బీఎస్‌ఈలో ఈ షేరు రూ. 3,613 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా ఇంట్రాడేలో 2.5% లాభపడి రూ.3,697 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి ఒకశాతం లాభంతో రూ.3659 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.13.53 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే మార్కెట్ విలువ పరంగా ఐటీ రంగానికే చెందిన ఇన్ఫోసిస్ మంగళవారం 100 బిలియన్ డాలర్ల(రూ.7.4 లక్షల కోట్లు) క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment