టాటా వెన్నంటే ఉన్న ఈ కుర్రాడి గురించి తెలుసా..? | Shantanu Naidu Who Is Also Known For Being Ratan Tata Trusted Aide, Know Facts About Him In Telugu | Sakshi
Sakshi News home page

Who Is Shantanu Naidu: టాటా వెన్నంటే ఉన్న కుర్రాడి గురించి తెలుసా..?

Published Thu, Oct 10 2024 1:16 PM | Last Updated on Thu, Oct 10 2024 1:40 PM

Shantanu Naidu who is also known for being Ratan Tata trusted aide

రతన్‌ టాటా దేశంలో పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రియలిస్టుగా ఆయన గొప్పపేరు తెచ్చుకోవడమే కాదు, మానవతావాదిగా దేశప్రజల గుండెల్లో చోటు సంపాదించిన ఘనత ఆయన సొంతం. 86 ఏళ్ల​ రతన్‌టాటాకి చివరి వరకు అన్ని వేళల్లో సహాయకుడిగా తోడున్న వ్యక్తి శంతన్‌ నాయుడు(31). టాటా కుటుంబంతో ఎటువంటి సంబంధంలేని ఈయన రతన్‌ టాటాకి ఎలా చేరువయ్యాడో.. ఇద్దరికి కామన్‌గా ఉన్న అభిరుచేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

శంతన్‌ నాయుడు 1993లో పుణెలో జన్మించారు. పుణె యూనివర్సిటీ నుంచి  2014లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌  పూర్తి చేశారు. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత టాటా గ్రూపులో డీజీఎం హోదాలో చేరారు. రతన్‌ టాటాకు మలి వయసులో ఈ యువ ఇంజినీర్ చేదోడు వాదోడుగా నిలిచారు.

మూగజీవులకు సాయం చేసే గుణం

ఓ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మధ్యలో వీధి కుక్క చనిపోయి కనిపించింది. ఆ కుక్క మృతదేహం మీదుగానే వాహనాలు పోతుండడం గమనించాడు. ఈ దృశ్యం చూసి శంతన్‌ చలించిపోయాడు. వీధి కుక్కుల సంరక్షణకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్‌ని తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కలకు వాటిని అమర్చాడు. ఆ పనికి మరుసటి రోజే స్థానికుల నుంచి మెప్పు పొందాడు. ఈ క్రమంలో ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటికీ ఈ రేడియం కాలర్‌ అమర్చాలని నిర్ణయించారు. కానీ అది డబ్బుతో కూడకున్న వ్యవహారం కావడంతో విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. ఆయన ‘వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్‌ టాటాని అడుగు. ఆయనకు కుక్కలంటే ఇష్టం’ అని సలహా ఇచ్చాడు.

టాటాతో పరిచయం ఇలా..

వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు ‘మోటోపాస్‌’ పేరుతో స్టార్టప్‌ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ పూర్తి వివరాలు కలిగిన ఈ మెయిల్‌ను ఏకంగా రతన్‌టాటాకే పంపాడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి రిప్లై లేకపోవడంతో తన రెగ్యులర్‌ పనిలో నిమగ్నమయ్యాడు. చివరకు రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్‌టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్‌టాటాతో శంతన్‌ నాయుడికి తొలి పరిచయం ఏర్పడేలా చేసింది. వ్యక్తిగతంగా రతన్‌ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు. వీధి కుక్కల పట్ల అతను చూపించే ప్రేమకు రతన్‌టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు. అలా మోటోపాస్‌ స్టార్టప్‌నకు ఆర్థికసాయం అందింది.

ఇదీ చదవండి: వర్షంలో తడిసిన ఆ నలుగురే ‘నానో’కు పునాది

చివరి వరకు తనతోనే..

కార్నెల్‌ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతన్‌ అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులో పని చేయాలని శంతను నిర్ణయించుకున్నాడు. ఎంబీఏ పూర్తయి తిరిగి వచ్చిన ఇండియా తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(డిజీఎం) హోదాలో చేరారు. అయితే కొద్ది కాలానికే శంతన్‌‌ను పిలిపించుకున్న రతన్‌ టాటా..తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండాలని కోరారు. దాంతో 2018 నుంచి టాటా తుది శ్వాస వరకు వెన్నంటి ఉన్నాడు.

ఒంటరితనం పోగొట్టేందుకు స్టార్టప్‌

సాటి జీవుల పట్ల శంతను నాయుడికి ఉన్న ప్రేమ రతన్‌టాటాను ఆకట్టుకున్నాయి. శంతన్‌ ‌నాయుడి ఆలోచణ సరళి టాటాను ఆకర్షించింది. మోటోపాస్‌తోపాటు శంతన్‌ సెప్టెంబర్‌ 2022లో ‘గుడ్‌ఫెలోస్‌’ను స్థాపించారు. ఇది యువకులను మమేకం చేసి సీనియర్ సిటిజన్‌ల ఒంటరితనం పోగొట్టేందుకు పనిచేస్తోంది. అతను ‘ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్’ పేరుతో రతన్‌ టాటాతో ఉన్న జ్ఞాపకాలు, తన నుంచి నేర్చుకున్న విషయాలపై పుస్తకం రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement