
రతన్ టాటాతోపాటు గతంలో సంస్థ పగ్గాలు చేపట్టిన సారథులు ఇండియాను ఒక ఎకనామిక్ సూపర్ పవర్‌గా చూడాలనుకున్నారు. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎక్కువగా కృషి చేశారు. అందులో భాగంగానే రతన్ టాటా ‘నానో’ కారును విడుదల చేశారు. అయితే ఈ కారు ఆవిష్కరణకు పునాది ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకసారి రతన్‌టాటా తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక దంపతులిద్దరు, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే..వెంటనే ఆయన పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దాదాపు రూ.ఒక లక్ష ధర ఉండేలా ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు? అని భయపెట్టారు. కొంత మంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజినీర్లను పిలిపించారు. కానీ వారు లక్ష రూపాయల్లో కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా అంతటితో ఆగిపోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ‘నానో’ను ఆవిష్కరించారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు విఫలమైంది. నానో కారు తయారుచేయడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.
ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’
రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్‌లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. దాంతో మొత్తం ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు.