సాక్షి, ముంబై: బిజినెస్ టైకూన్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు పల్లోంజీ.
1929లో జన్మించిన మిస్త్రీ లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించారు. అంతకుముందు ముంబైలోని కేథడ్రల్ & జాన్ కానన్ స్కూల్‌లో చదువుకున్నారు. కేవలం18 సంవత్సరాల వయస్సులో కరియర్‌ను స్టార్ట్ చేసిన ఆయన క్రమంగా బడా పారిశ్రామికవేత్తగా రాణించారు. 28.90 బిలియన్ డాలర్లతో పల్లోంజీ మిస్త్రీ బిలియనీర్‌గా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం భారతదేశంలో 5వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. పార్సీ కుటుంబంలో జన్మించిన షాపూర్జీ 2003లో వివాహం ద్వారా ఐరిష్ పౌరసత్వాన్ని పొందారు. వాణిజ్య రంగంలో చేసిన విశేష సేవలకుగాను 2016లో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మభూషణ్ అందుకున్నారు.
1865లో స్థాపితమై ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వ్యాపారాలను నిర్వహిస్తోంది పల్లోంజీ గ్రూపు. ముంబైకి చెందిన 156 ఏళ్ల ఈ గ్రూప్ ఇప్పుడు ఆఫ్రికా, ఇండియా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియాలో నిర్మాణ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
కాగా పల్లోంజీ మిస్త్రీకి ఇద్దరు కుమారులు షాపూర్ మిస్త్రీ, సైరస్ మిస్త్రీ, ఇద్దరు కుమార్తెలు లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ ఉన్నారు. సైరస్ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేశారు. అయితే 2016 అక్టోబర్‌లో మిస్త్రీ చిన్న కుమారుడు సైరస్‌ను టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంతో టాటా, మిస్త్రీల మధ్య వివాదం రగిలిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment