న్యూఢిల్లీ: ప్రధాన కేంద్రాల నుంచి వివిధ ప్రాంతాలకు వైమానిక సర్వీసులకి మరింత ఊతమిచ్చే దిశగా ప్రాంతీయ ఎయిర్‌లైన్స్, హెలికాప్టర్ ఆపరేటర్లకు సంబంధించి ప్రత్యేక పాలసీ రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. చిన్న పట్టణాల్లోని విమానాశ్రయలతో పాటు ప్రాంతీయంగా కనెక్టివిటీపైనా ప్రధానంగా దృష్టి పెడుతోంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాలు వెల్లడించారు.
‘సాధారణంగా ఇలాంటి సర్వీసులకు ప్రత్యేక సమస్యలు ఉంటాయి. పరిమిత స్థాయిలో కార్యకలాపాల వల్ల అధిక లీజింగ్ వ్యయాలు, ధరలపరమైన సవాళ్లు ఉంటాయి. వీటిని అధిగమించడంపై దృష్టి పెడుతున్నాం. ప్రాంతీయ ఎయిర్‌లైన్స్, హెలికాప్టర్ల సేవలు మరింత అందుబాటులోకి వచ్చే విధంగా ప్రత్యేక పాలసీపై కసరత్తు చేస్తున్నాం‘ అని మంత్రి చెప్పారు. ఒడిషాలోని ఝర్సుగూడ, అసోంలోని రూప్‌సీ వంటి చిన్న నగరాల్లో కూడా ఇలాంటి సర్వీసులు వృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని వివరించారు.
ప్రస్తుతం భారత్‌లో హెలికాప్టర్ల వినియోగం నామమాత్రంగానే ఉందన్నారు. సంపన్న దేశాల్లో సివిల్ హెలికాప్టర్లు వేల సంఖ్యలో ఉంటుండగా.. భారత్‌లో 130-140 మాత్రమే ఉన్నాయని సింధియా చెప్పారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని సింధియా తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు గణనీయంగా తగ్గించాయని వివరించారు.
(చదవండి: టాటా గ్రూప్‌కి షాక్ ! ఊహించని మలుపు తీసుకున్న సీఈవో నియామకం)
Comments
Please login to add a commentAdd a comment