ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడుతూ.., ముందుకే కదిలే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘మార్కెట్ అప్‌సైడ్ మూమెంట్‌ను ప్రోత్సహించే సానుకూలాంశాలు పరిమితంగా ఉన్నందున్న స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు.
ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రసంగం, కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. నిఫ్టీ 18,500 స్థాయిని నిలుపుకోలిగితే 18,700 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే 19,000 వద్ద మరో కీలక నిరోధం ఉంది. రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,100 తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్ పతనంతో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడంతో బెంచ్‌మార్క్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, బ్యాంక్స్, టెక్నాలజీ, మౌలిక రంగ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 631 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
స్థూల ఆర్థిక గణాంకాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ డేటా బుధవారం(నవంబర్ 30న) విడుదల అవుతుంది. డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ క్యూ2లో వృద్ధి ఆరుశాతానికి పైగా నమోదుకావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అదేరోజున అక్టోబర్ ద్రవ్య లోటు, మౌలిక రంగ గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(గురువారం) నవంబర్ తయారీ రంగ పీఎంఐ డేటా, వాహన విక్రయ గణాంకాలు విడుదల అవుతాయి. అలాగే శుక్రవారం ఆర్‌బీఐ నవంబర్ 25 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 18వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.
ప్రపంచ పరిణామాలు
ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం రాత్రి బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రసగించనున్నారు. కీలక వడ్డీరేట్ల పెంపుదల క్రమంగా నెమ్మదించవచ్చని ఫెడ్ మినిట్స్‌లో వెల్లడైన తర్వాత మార్కెట్ వర్గాలు పావెల్ వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం వెల్లడి అవుతుంది. అదే రోజున ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాల స్థితిగతులను తెలియజేసే ‘‘బీజ్ బుక్’’ను ఫెడ్ రిజర్వ్ విడుదల చేయనుంది. చైనాలో కరోనా కేసులు, లాక్‌డౌన్ విధింపు వార్తలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. రష్యా చమురు నిషేధం తొలగింపుపై పాశ్చత్య దేశాల చర్యలతో క్రూడాయిల్ ధరలు అనూహ్యంగా పతనమయ్యాయి. గతవారంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర పదినెలల కనిష్టానికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 106 స్థాయికి దిగివచ్చింది.
బుల్లిష్‌గా ఎఫ్‌ఐఐల వైఖరి
భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నవంబర్‌లో ఇప్పటి వరకు (25 తేదీనాటికి) దేశీయ మార్కెట్లో రూ.31,630 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘కీలక వడ్డీరేట్లపై ఫెడ్ రిజర్వ్ దూకుడు వైఖరిని తగ్గించుకోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. దీంతో ఎఫ్‌ఐఐలు మన ఈక్విటీల్లో మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ షేర్ల పట్ల అధిక బుల్లిష్ వైఖరిని కనబరుస్తున్నారు. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు తెరపైకి వస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.
ఈ వారంలో రెండు ఐపీవోలు
ఈ వారంలో ధర్మజ్ క్రాప్, యూనిపార్ట్స్ ఇండియా కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఆగ్రో కెమికల్ ధర్మజ్ క్రాప్ సంస్థ ఇష్యూ భాగంగా రూ.216 కోట్ల విలువైన తాజా షేర్లను, ప్రమోటర్ల ద్వారా రూ. 35.15 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. తద్వారా మొత్తం రూ. 251 కోట్లను సమీకరించనుంది. ఇందుకు ధర శ్రేణి రూ.216 – 327గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ 28న మొదలై 30న ముగిస్తుంది. ఇంజనీరింగ్ సిస్టమ్స్ కంపెనీ యూనిపార్ట్స్ ఇండియా ఐపీఓ నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 2న ముగుస్తుంది. మొత్తం 1.4 కోట్ల షేర్లను విక్రయించి రూ.836 కోట్లను కంపెనీ సేకరిస్తుంది. ఐపీఓ ధర శ్రేణి రూ.548–577గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment