ముంబై: సూపర్ స్పోర్ట్స్ కార్ల విభాగం భారత్‌లో ఈ ఏడాది 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్ ఆటోమోటివ్ శుక్రవారం తెలిపింది. సరఫరా సమస్యల కారణంగా గత సంవత్సరం నష్టపోయిన తర్వాత మెక్‌లారెన్ ఇక్కడి వినియోగదారులకు ఈ ఏడాది దాదాపు 20కిపైగా కార్లను డెలివరీ చేయాలని భావిస్తోంది. 2022 నవంబర్‌లో భారత మార్కెట్లోకి కంపెనీ ప్రవేశించింది.
‘రూ.4–5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఈ కార్ల సెగ్మెంట్ గతేడాది కూడా ఆరోగ్యకర వృద్ధిని సాధించింది. కోవిడ్ తర్వాత పరిమాణం పరంగా 2021 ఒక రకమైన ప్రారంభ సంవత్సరం. 2022 బాగుంది. గతేడాది మెరుగ్గా ఉంది. 2024 ఇంకా మెరుగ్గా ఉంటుంది. గత సంవత్సరం అమ్మకాలలో స్వల్ప తగ్గుదల ఉంది. ఒక మోడల్ నుండి మరొక మోడల్‌కు మారడం వల్ల ఉత్పత్తిలో కొన్ని నెలల గ్యాప్ ఉంది. ఫలితంగా 2024లో మేము దాదాపు 20 యూనిట్లను డెలివరీ చేయాలని భావిస్తున్నాం’ అని ఇని్ఫనిటీ కార్స్ సీఎండీ లలిత్ చౌదరి తెలిపారు.
భారత్‌లో మెక్‌లారెన్ ఆటోమోటివ్ అధికారిక డీలర్‌గా ఇని్ఫనిటీ కార్స్ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భారత రోడ్లపై దాదాపు 30 మెక్‌లారెన్ కార్లు పరుగెడుతున్నాయి. జీటీ, ఆర్చురా హైబ్రిడ్ మోడల్‌ను కంపెనీ ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి తెచి్చంది. కాగా, మెక్‌లారెన్ తన సూపర్ స్పోర్ట్స్ కారు 750ఎస్ మోడల్‌ను రూ.5.91 కోట్ల ధరతో ఆవిష్కరించింది. యూకేలోని యార్క్‌షైర్‌లో ఉన్న మెక్‌లారెన్ కాంపోజిట్స్ టెక్నాలజీ సెంటర్‌లో ఈ కారు తయారైంది. పూర్తిగా తయారైన కార్లనే భారత్‌కు దిగుమతి చేస్తున్నారు. కంపెనీ నుండి అత్యంత తేలికైన, శక్తివంతమైన మోడల్ ఇదే. 7.2 సెకన్లలో గంటకు 0–200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment