న్యూఢిల్లీ: టెలికం రంగం కోలుకోవాలంటే టారిఫ్‌ల పెంపు, కనీస ధరల విధానం అమల్లోకి రావడం కీలకమని వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. కంపెనీకి అవసరమైన తోడ్పాటునిచ్చేందుకు వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ కట్టుబడి ఉన్నాయని ఆయన వివరించారు. పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు ఉన్న ఇన్వెస్టర్లతో చర్చలు కొనసాగిస్తుంటామని తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టక్కర్ పేర్కొన్నారు.
ఇటీవల ఎంట్రీ స్థాయి కార్పొరేట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు, ఇతర పథకాల టారిఫ్‌లను పెంచడం సరైన దిశలో తీసుకున్న నిర్ణయమని ఆయన వివరించారు. దీని వల్ల సగటున ప్రతి యూజరుపై ఆదాయం (ఏఆర్‌పీయూ) మెరుగుపడగలదన్నారు. అయితే టెలికం రంగం వ్యవస్థాగతంగా కోలుకోవాలంటే ఇది సరిపోదని టక్కర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం పరిశ్రమ మెరుగుపడటానికి కీలకమైన కనీస ధర అంశంపై నియంత్రణ సంస్థతో చర్చలు జరపడం కొనసాగిస్తామని ఆయన వివరించారు.
(చదవండి: భారత్‌లోకి ‘ప్లే బాయ్’ వచ్చేస్తున్నాడు..!)
ఉన్నతమైన సేవలకు కట్టుబడి ఉన్నాం
అత్యుత్తమ సేవలను అందించాలన్న తమ అంకిత భావం కొనసాగుతుందని టక్కర్ వినియోగదారులకు భరోసానిచ్చారు. వీఐగా పేరు మార్చుకుని ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టక్కర్ మాట్లాడారు. కంపెనీకి మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదములు తెలిపారు. నెట్‌వర్క్ అనుసంధానత పెంపుపై గడిచిన ఏడాది కాలంలో దృష్టిసారించినట్టు చెప్పారు. ‘‘డిజిటల్ భారత్ కోసం మెరుగైన రేపటిరోజు, అత్యుత్తమ టెక్నాలజీ, సేవలు, పరిష్కారాలు అందిస్తామంటూ వీఐ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు సేవలు అందించేందుకు ఇకముందూ మా కృషి కొనసాగుతుంది’’ అని టక్కర్ తెలిపారు.
వొడాఫోన్ ఐడియా నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుమారు రూ.1.6 లక్షల కోట్లను చెల్లించాల్సిన (ప్రభుత్వానికి, బ్యాంకులకు) పరిస్థితుల్లో ప్రభు త్వం నుంచి సాయం లభించకపోతే వొడా ఫోన్ ఐడియా కోలుకోవడం కష్టమంటూ సంస్థ చైర్మన్ హోదాలో కుమార మంగళం బిర్లా ఇటీవలే కేంద్రానికి ఓ లేఖ రాయడం గమనార్హం. ఈ క్రమంలో వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా సీఈవో భరోసానివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
(చదవండి:ఈ మొబైల్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ హట్‌స్టార్ ఉచితం..!)
Comments
Please login to add a commentAdd a comment