సాక్షి, ముంబై: టాటా గ్రూపు మరో బిగ్గెస్ట్ డీల్‌ను కుదుర్చుకోనుంది. భారతదేశపు అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ మేకర్ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రూ. 7 వేల కోట్లకు కొనుగోలు చేయనుంది. బిస్లరీ కంపెనీ చైర్మన్ రమేష్ చౌహాన్ వ్యాఖ్యలని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
సంచలన బ్రాండ్ బిస్లరీ థమ్సప్, గోల్డ్ స్పాట్, లిమ్కా ఆవిష్కర్త రమేశ్ చౌహాన్ మూడు దశాబ్దాల క్రితం (1993) ఏరేటెడ్ డ్రింక్స్ బ్రాండ్లను కోకోకోలాకు విక్రయించారు. తాజాగా బిస్లరీని సైతం విక్రయించేందుకు సిద్ధమయ్యారు. టాటా కన్జూమర్స్ సంస్థ బిస్లరీ బ్రాండ్ ను రూ. 7వేల కోట్లకు కొనుగోలు చేయనుంది. విక్రయ ఒప్పందంలో భాగంగా ప్రస్తుత నిర్వహణ రెండేళ్ల పాటు కొనసాగనుంది. కుమార్తె జయంతి వ్యాపారంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 82 ఏళ్ల చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
గత సెప్టెంబరులోనే బిస్లరీ అమ్మకానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సహా పలు కంపెనీలు టాటాతో రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ,టాటా కన్స్యూమర్ సీఈఓ సునీల్ డిసౌజాతో సమావేశం తర్వాత రమేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
బాధాకరమైన నిర్ణయమే..కానీ,
బిస్లరీ విక్రయం ఇప్పటికీ బాధాకరమైన నిర్ణయమే అయినప్పటికీ టాటా గ్రూప్ టాటా గ్రూపు మరింత అభివృద్ది చేసి, ఇంకా బాగా చూసుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ నిజాయితీ, జీవిత విలువలను గౌరవించే సంస్కృతి తనకిష్టమనీ, అందుకే ఆసక్తిగల కొనుగోలుదారుల దూకుడును పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఈ డీల్ కేవలం డబ్బుకు సంబంధించినది కాదని, ఎంతో ప్రేమ, అభిరుచితో నిర్మించుకున్న వ్యాపారం, ఇప్పుడు అదే ఉత్సాహంతో ఉద్యోగులు నడుపుతున్నారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అలాగే కంపెనీలో మైనారిటీ వాటా కూడా ఉంచుకోకపోవడంపై చైర్మన్ చౌహాన్ మాట్లాడుతూ, కంపెనీలో చురుగ్గా తానేమీ చేయలేనపుడు దీని వలన పెద్దగా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. మరోవైపు బిస్లరీ విక్రయం తర్వాత, చౌహాన్ వాటర్ హార్వెస్టింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్, పేదలకు వైద్య సహాయం లాంటి పర్యావరణ, స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి సారించాలని యోచిస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment