టాటా మహా సామ్రాజ్య జైత్రయాత్ర ఇది...
పరుగులు తీయించిన రతన్
విదేశీ కంపెనీల కొనుగోళ్ల దన్ను
రతన్ సాహసోపేత నిర్ణయాలతో ఆకాశమే హద్దుగా ఎదిగిన గ్రూప్
ఉప్పు నుంచి ఉక్కు దాకా... సబ్బుల నుంచి సాఫ్ట్‌వేర్ అగ్రగామిగా... దేశ ప్రజల తలలో నాలుకగా మారిన టాటా గ్రూప్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. నేడు రూ.30 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువతో దేశ కార్పొరేట్ జగత్తులో అత్యంత విలువైన ‘రతనం’లా వెలిగిపోతోంది. అలుపెరుగని ఈ పయనంలో టాటా బ్రాండ్‌కు ఖండాంతర ఖ్యాతిని తెచి్చన ఘనత కార్పొరేట్ ‘టైటాన్’ రతన్ టాటా సొంతం! లాభార్జనే ధ్యేయంగా కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకూ తమ వ్యాపార ఫలాలను పంచిన వితరణ శీలిగా కూడా చిరస్థాయిగా నిలిచిపోయారు.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన హయాంలో టాటా గ్రూప్‌ను మహాసామ్రాజ్యంగా విస్తరించారు. ఇటు ప్రధానమైన వ్యాపార విభాగాలను పటిష్టం చేస్తూనే అటు పేరొందిన విదేశీ దిగ్గజ కంపెనీలను కూడా కొనేసి భారతీయ కార్పొరేట్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. మిగతా దేశీ కార్పొరేట్లకు స్ఫూర్తినిచ్చారు. విమర్శలు, హేళనలు ఎదురైనా వాటిన్నింటినీ అధిగమించి టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజంగా మల్చారు. రతన్ పగ్గాలు చేపట్టేనాటికి గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.30 వేల కోట్లు మాత్రమే.
ఇక ఆదాయం 6 బిలియన్ డాలర్ల (అప్పటి రూపాయి మారకం విలువ ప్రకారం రూ.18,000 కోట్లు) స్థాయిలో నిదానంగా పురోగమిస్తున్న టాటా గ్రూప్ ఆయన సాహసోపేత నిర్ణయాలు, దూకుడు దన్నుతో నేడు ఏకంగా 165 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు) ఆదాయాల స్థాయికి విస్తరించింది. టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్,
టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి దిగ్గజాలు ఆయా రంగాల్లో అగ్రగాములుగా ఉన్నాయి. గ్రూప్ సంస్థల్లో ఏకంగా 10 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. గ్రూప్‌లో పది విభాగాల్లో ప్రధానంగా 30 కంపెనీలు ఉండగా వీటిలో 26 లిస్టెడ్ కంపెనీలున్నాయి. వీటికి అనుబంధంగా పలు సంస్థలు కూడా ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి వాటి టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా 365 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.30 లక్షల కోట్లు) అధిగమించడం విశేషం. టాటా సామ్రాజ్యంలోని సంస్థలు ఆరు ఖండాల్లో 100 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
6 బిలియన్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు..
రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా సన్స్ చైర్మన్‌గా వ్యవహరించారు. వివిధ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న 95 కంపెనీలు గ్రూప్‌లో ఉండేవి. కెమికల్స్, హోటల్స్, ఉప్పు, ఉక్కు, సబ్బులు, వాచీలు మొదలైన విభాగాల్లో ఇవన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తూ, ఒకదానితో మరొకదానికి పెద్దగా సంబంధం లేని విధంగా ఉండేవి. రతన్ టాటా వచ్చాక వాటన్నింటినీ పునర్‌వ్యవస్థీకరించడం, కార్యకలాపాలను క్రమబదీ్ధకరించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివిధ అనుబంధ సంస్థలన్నింటికి కూడా ఒకే కార్పొరేట్ గుర్తింపు ఉండాలని నిర్దేశించారు. దేశీ మార్కెట్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టి, నిదానంగా నడుస్తున్న గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయి విస్తరించారు. ఐఐఎం బెంగళూరు పరిశోధన పత్రం ప్రకారం ఆయన హయాంలో గ్రూప్ ఆదాయాలు 6 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 18,000 కోట్ల నుంచి రూ. 5.5 లక్షల కోట్లకు) ఎగిశాయి. గ్రూప్ మార్కెట్ విలువ 9.5 బిలియన్ డాలర్ల నుంచి 91.2 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 30,000 కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లకు) పెరిగింది.
కీలక కొనుగోళ్లు..
కోరస్: ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్‌ను 2007లో టాటా స్టీల్ ఏకంగా 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. ఒక విదేశీ కంపెనీని ఇంత భారీ మొత్తం వెచి్చంచి కొనుగోలు చేయడం అప్పటిదాకా కనీవినీ ఎరుగనిది. ఈ కొనుగోలుతో టాటా స్టీల్ ఒక్కసారిగా ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు దిగ్గజాల జాబితాలోకి చేరిపోయింది. గ్రూప్ మార్కెట్ విలువను గణనీయంగా పెంచింది. అప్పటిదాకా ఎక్కువగా దేశీ మార్కెట్‌పైనే దృష్టి పెట్టిన టాటా స్టీల్, కోరస్ కొనుగోలుతో యూరప్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది.
జాగ్వార్ ల్యాండ్‌రోవర్: రతన్ టాటా 2008లో మరో సాహసోపేతమైన ముందడుగు వేశారు. ఈసారి దిగ్గజ బ్రిటీష్ కార్ల బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్‌రోవర్‌పై గురి పెట్టారు. 2.3 బిలియన్ డాలర్లు పెట్టి కొనేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆ తర్వాత అదొక మాస్టర్‌స్ట్రోక్ అని
రతన్ టాటా నిరూపించారు.
గ్లోబలైజేషన్ బాటలో గ్రూప్..
ప్రధానంగా భారత్‌పై దృష్టితో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రూప్‌ను గ్లోబల్ ప్లేయర్‌గా రతన్ టాటా తీర్చిదిద్దారు. ఇందుకోసం దూకుడుగా విదేశీ కంపెనీలను కొన్నారు. 2008లో బ్రిటీష్ లగ్జరీ కార్ల బ్రాండ్లు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేయడం ద్వారా అంతర్జాతీయ ఆటోమోటివ్ మార్కెట్లో టాటా మోటార్స్‌ను ప్రముఖ సంస్థగా నిలిపారు. అంతకన్నా ముందుగా 2000లో టెట్లీని కొనుగోలు చేయడం ద్వారా గ్లోబల్ టీ మార్కెట్లో టాటా గ్రూప్ కూడా ప్రధాన ప్లేయర్‌గా ఎదిగింది.
టీసీఎస్.. ఐటీ కోహినూర్!
టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్) పాత్ర చాలా కీలకం. 1968లోనే ఏర్పడినప్పటికీ రతన్ టాటా సారథ్యంలో టీసీఎస్‌కి రెక్కలొచ్చాయి. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకి వచి్చంది. ఏకంగా రూ. 4,713 కోట్లు సమీకరించింది. అప్పటి నుండి అద్భుతమైన పనితీరుతో టీసీఎస్ దూసుకెళ్తోంది. టీసీఎస్‌తో పాటు టాటా మోటర్స్, టాటా స్టీల్, టాటా పవర్ దన్నుతో గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 30 లక్షల కోట్లకు ఎగిసింది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment