న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 2024 ఏప్రిల్ నుంచి గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ చేపట్టనుంది. తొలుత నెక్సన్ ఈవీ మోడల్ కార్లను ఉత్పత్తి చేయనున్నామని సంస్థ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర వెల్లడించారు. ఫోర్డ్ ఇండియా నుంచి రూ.725 కోట్లకు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈ ప్లాంటును 2023 జనవరిలో కైవసం చేసుకుంది.
సనంద్ ప్లాంట్‌లో ఇప్పటికే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఆధారిత నెక్సన్ కార్ల తయారీని ప్రారంభించింది. ప్రస్తుతం తయారీ సామర్థ్యం ఏటా 3 లక్షల యూనిట్లు. దీనిని 4.2 లక్షల యూనిట్లకు పెంచే అవకాశం ఉంది. ఇతర మోడళ్లను సైతం ఈ కేంద్రంలో రూపొందిస్తామని చంద్ర తెలిపారు. ‘ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కర్వ్ ఈవీ రానుంది. హ్యారియర్ ఈవీతోపాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌తో కర్వ్ మోడల్‌ను ఈ ఏడాది చవరికల్లా పరిచయం చేస్తాం. 2024–25లో ప్యాసింజర్ కార్ల పరిశ్రమ భారత్‌లో 5 శాతం వృద్ధి చెందనుంది.
కొత్త మోడళ్ల రాకతో పరిశ్రమ కంటే మెరుగ్గా పనితీరు కనబరుస్తాం. వ్యక్తిగత ఎలక్ట్రిక్ కార్లకు ఫేమ్ ప్రయోజనాలను విస్తరించడం దేశంలో ఈవీల వృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొనుగోలుదార్లకు ప్రోత్సాహకాలు అందించినప్పుడు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరిగాయి. ఈవీల విక్రయాలపై పన్ను రేటు కంటే వాటి తయారీకి ఉపయోగించిన ముడిసరుకుపై పన్ను రేటు ఎక్కువగా ఉంది. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment