న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తాజాగా తమ సిటీ ఈ:హెచ్‌ఈవీ సెడాన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారును గురువారం ఆవిష్కరించింది. ఈ కారుకి సంబంధించి బుకింగ్స్ ప్రారంభించామని, వచ్చే నెలలో మార్కెట్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నామని సంస్థ భారత విభాగం ప్రెసిడెంట్ తకుయా సుమురా తెలిపారు. రెండు సెల్ఫ్–చార్జింగ్ మోటార్లు, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలు ఈ కారులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరింత విస్తృతమైన యాంగిల్‌తో ఫ్రంట్ కెమెరా, ముందున్న రహదారిని స్కాన్ చేసి .. ప్రమాదాలను నివారించేలా డ్రైవరును అప్రమత్తం చేయగల సాంకేతికత మొదలైనవి ఇందులో పొందుపర్చినట్లు సుమురా వివరించారు.
వచ్చే ఏడాది సరికొత్త ఎస్‌యూవీని (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సుమురా తెలిపారు. తమ ఉత్పత్తుల ఎగుమతులకు భారత్‌ను కీలక కేంద్రంగా మార్చుకోవడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 20 వేల పైచిలుకు వాహనాలు ఎగుమతి చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు అదే స్థాయిలో ఎగుమతులు ఉండగలవని సుమురా వివరించారు. చిప్‌ల కొరత, సరఫరా వ్యవస్థ సమస్యలతో వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment