కొత్త ఆవిష్కరణలకు ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ | Telangana State Innovation Cell pleased to announce sixth edition of Intinta Innovator 2024 | Sakshi
Sakshi News home page

కొత్త ఆవిష్కరణలకు ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’

Published Tue, Jul 9 2024 1:52 PM | Last Updated on Wed, Jul 10 2024 4:40 PM

Telangana State Innovation Cell pleased to announce sixth edition of Intinta Innovator 2024

చదువున్నా, లేకపోయినా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2024 సంవత్సరానికిగాను ఆరో విడత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతుంది. వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనటమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో అన్నదాతలు, విద్యావేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు..ఇలా ఎవరైనా ఆవిష్కరణలు చేయవచ్చని ప్రభుత్వం చెప్పింది. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో తమ ప్రయోగ వివరాలను తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులను అందజేస్తుంది.

ఈ సందర్భంగా ఐటీ అండ్ కమ్యునికేషన్‌ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ..‘ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. విభిన్న వర్గాల ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభను పెంపొందించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. గతంలో కంటే ఈ ప్రోగ్రామ్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు.

‘ఇంటింటా ఇన్నోవేటర్‌ 2024’ కార్యక్రమంలో పాల్గొనే ఆవిష్కర్తలు ఆగస్టు 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. వారి వివరాలను వాట్సాప్‌ 9100678543కి పంపించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం..

దరఖాస్తుదారు పేరు, వయసు, ఫొటో, వృత్తి, గ్రామం, మండలం వంటి వివరాలు ప్రాథమికంగా పంపించాలి. దాంతో పాటు 100 పదాలలోపు ఆవిష్కరణ గురించి క్లుప్తంగా వివరించాలి.  ఆవిష్కరణకు సంబంధించి రెండు నిమిషాల నిడివి ఉన్న రెండు వీడియోలు, నాలుగు ఫొటోలు తీసి పంపాల్సి ఉంటుంది.

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. స్థానిక సవాళ్లకు పరిష్కారం అందించే వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరింది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఆగస్టు 15, 2024న ప్రోత్సాహకాలు అందిస్తామని తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలకు చెందిన 3,000+ గ్రామ పంచాయతీల నుంచి ఆవిష్కర్తలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రోగ్రామ్‌ను 1 కోటి మందికి పైగా గ్రామీణ పౌరులకు అనుసంధానం చేయడం లక్ష్యంగా  పెట్టుకున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: నేరం జరిగింది.. రూ.2 వేలకోట్లు చెల్లిస్తాం: బోయింగ్‌

జిల్లాకు ఒకరు చొప్పున మొత్తం 33 మంది ‘ఇన్నోవేషన్ మిత్ర’లతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ బృందంలోని సభ్యులు కోఆర్డినేటర్‌లుగా సేవలందిస్తారు. జిల్లా అధికారులు, ఎన్‌జీఓలు, పౌర సమాజ సంస్థలు, గ్రామాల్లోని ప్రజలను అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement